More

జీఎస్టీకి మండలి ఆమోదం

31 Aug, 2016 02:21 IST
జీఎస్టీకి మండలి ఆమోదం

బిల్లు ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
మద్దతు తెలిపిన అన్ని పక్షాలు
అనుమానాలు నివృత్తి చేయాలి: కాంగ్రెస్, ఎంఐఎం
ధరలు తగ్గుతాయి.. ఆదాయం పెరుగుతుంది: బీజేపీ

 సాక్షి, హైదరాబాద్: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లును రాష్ట్ర శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఉదయం మండలిలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ ప్రారంభం కాగానే కరువు, రైతు సమస్యలపై చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లు తర్వాత బీఏసీ సమావేశంలో ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని చైర్మన్ స్వామి గౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒప్పించడంతో వారు శాంతించారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అల్తాఫ్ హైదర్ రజ్వీ, ఎస్.రామచందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పూల రవీందర్, కె.యాదవరెడ్డి, భానుప్రసాద రావు తదితరులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

 రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో చెప్పాలి: పొంగులేటి(కాంగ్రెస్)
జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో జీఎస్టీతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బిల్లును ఆమోదిస్తూనే ప్రజ ల్లో నెలకొన్న అనుమానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. ఆర్‌ఎన్‌ఆర్ 18 శాతం మించకుండా కేంద్రం తీసుకునే నిర్ణయంపై కూడా స్పష్టత రావాలి.

 మన వాటా ఎంత?: అల్తాఫ్ హైదర్ రజ్వీ (ఎంఐఎం)
జీఎస్టీలో వసూలయ్యే మొత్తంలో రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందో చెప్పాలి. జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చే అనేక రకాల పన్నుల ఆదాయాన్ని కోల్పోతాం. దీన్ని పరిహారం రూపంలో ఐదేళ్ల పాటు ఇస్తామంటున్నారు. దీనిపై స్పష్టత రావాలి.

 పన్ను ఎగవేతలు తగ్గుతాయి: ఎస్.రాంచందర్ రావు (బీజేపీ)
జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే పన్ను విధానంతోపాటు పన్ను ఎగవేతలకు కళ్లెం పడుతుంది. ధరలు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ పెట్టుబడుల కారణంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.

 సేవారంగం వృద్ధి చెందుతుంది: పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
జీఎస్టీతో ఉత్పత్తి రంగంతో పాటు సేవారంగం కూడా వృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు మీద పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. జీఎస్టీలో ఉత్పత్తి అయిన వస్తువును ఉపయోగించినప్పుడు, సేవ పొందినప్పుడే పన్ను చెల్లించడం జరుగుతుంది.

 పన్ను శాతం ఎంత?: యాదవరెడ్డి (టీఆర్‌ఎస్)
జీఎస్టీ అమలులోకి వస్తే వినియోగించే వస్తువుపై ఎంత శాతం పన్ను పడుతుందనే విషయంలో స్పష్టత లేదు. 22 శాతం, 18 శాతం అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలి.

రాష్ట్రానికి లాభమో, నష్టమో ఇప్పుడే చెప్పలేం: కడియం
జీఎస్టీ వల్ల తెలంగాణకు లాభమో, నష్టమో ప్రస్తుత పరిస్థితుల్లో తేల్చి చెప్పడం కష్టమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నా రు. ‘‘జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ఉభయసభలు ఆమోదించాయి. దేశంలోని 50 శాతం రాష్ట్రాలు ఆమోదిస్తే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. 2015-16లో రూ.31,117 కోట్ల పన్ను వసూలైతే...

అందులో పెట్రోల్, మద్యంపై వచ్చిన ఆదాయం రూ.14,654 కోట్లు. భవిష్యత్తులో కూడా ఇది రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది. వృత్తి పన్ను మినహాయిస్తే.. మిగతా రూ.16,077 కోట్లు జీఎస్టీ పరిధిలోకి వెళ్తుంది. రెవెన్యూ న్యూట్రల్ రేషియో (ఆర్‌ఎన్‌ఆర్)ను కూడా ఇప్పుడే నిర్ణయించలేం. జీఎస్టీ వల్ల నష్టపోతామన్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పింది. సేవారంగం ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో జీఎస్టీ వల్ల లాభమే జరుగుతుంది. సర్వీస్ టాక్స్‌లో 50 శాతం మేర రూ.4 వేల కోట్లు రాష్ట్రానికి సమకూరుతుంది. ఆహార ధాన్యాలపై పన్ను ఎత్తివేసే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి మంచే జరుగుతుంది’’ అని కడియం అన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. సీనియర్లకు ఇద్దరు మహిళలు షాకిచ్చేనా?

కేసీఆర్‌,కేటీఆర్‌కు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంక గాంధీ

నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి.. రేవంత్‌రెడ్డి ఫైర్‌

నా చెల్లి డైనమిక్‌.. కూతురు పుట్టాక జీవితం మారిపోయింది: కేటీఆర్‌

బాబూ మోహన్‌కు తనయుడి షాక్‌