More

అపజయమెరుగని కాషాయధారి

11 Mar, 2022 03:19 IST

లక్నో: యోగి ఆదిత్యనాథ్‌.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు. బీజేపీని మరోసారి విజయతీరాలకు చేర్చిన నేతగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం యోగియే అన్న ప్రచారం సైతం ఇప్పటికే ఊపందుకుంది. హిందుత్వ నినాదానికి ‘పోస్టర్‌ బాయ్‌’గా, ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు పొందిన యోగి ఆదిత్యనాథ్‌ తరచుగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకూ ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం.

► యోగి ఆదిత్యనాథ్‌ అసలు పేరు అజయ్‌సింగ్‌ బిస్త్‌.
► ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో పౌరీ గర్వాల్‌ జిల్లాలోని పాంచుర్‌ (ప్రస్తుత ఉత్తరాఖండ్‌)లో 1972 జూన్‌ 5న ఠాకూర్‌ సామాజికవర్గంలో జన్మించారు. తండ్రి ఆనంద్‌సింగ్‌ బిస్త్‌ ఫారెస్ట్‌ రేంజర్‌గా పనిచేశారు. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో యోగి రెండో సంతానం.

► 1990లో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో చేరారు. చురుగ్గా కార్యకలాపాలు సాగించారు.
► గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయ పీఠాధిపతి మహంత్‌ అవైద్యనాథ్‌కు ప్రియ శిష్యుడిగా మారారు.

► అవైద్యనాథ్‌ మరణం తర్వాత 2014లో గోరఖ్‌నాథ్‌ ఆలయ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ పీఠాధిపత్యం ఆయనదే.
► పీఠాధిపతిగా ఉంటూ బీజేపీపై విమర్శలు చేసేందుకు కూడా ఆదిత్యనాథ్‌ వెనకాడలేదు. హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందంటూ తూర్పారబట్టేవారు. అయినా యోగిపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు అభిమానం ప్రదర్శించేవారు.

► ‘హిందూ యువవాహని’ పేరిట యోగి సొంతంగా ఒక సేనను తయారు చేశారు. అందులో భారీగా కార్యకర్తలను చేర్చుకున్నారు.
► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. హేమావతి నందన్‌ బహుగుణ గర్వాల్‌ వర్సిటీ నుంచి మ్యాథ్స్‌లో బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ అందుకున్నారు. 1998లో సొంత గ్రామంలో స్కూలు నెలకొల్పారు.

► గురువు అవైద్యనాథ్‌ మార్గదర్శకత్వంలో 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
► 28 ఏళ్ల వయసులోనే గోరఖ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కుడు ఆయనే.
► 1998, 1999, 2004, 2009, 2014ల్లో ఐదుసార్లు గోరఖ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

► 2017 ఎన్నికల్లో యూపీలో ఘనవిజయం సాధించిన బీజేపీ యోగిని అనూహ్యంగా సీఎంగా ఖరారు చేసింది. 2017 మార్చి 19న యూపీ 21వ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు.
► హిందుత్వ ప్రతినిధిగా తన ప్రతిష్టను మరింత పెంచుకొనేలా యోగి పలు నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో గోవధపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కబేళాలను మూసేయించారు.

► లవ్‌ జిహాద్‌ను అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా తొలుత ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు తెచ్చారు.
► అవినీతి, అక్రమాలకు దూరంగా నిజాయితీపరుడైన నాయకునిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు.

► సీఎం పదవి నుంచి యోగిని తప్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు గతేడాది బాగా విన్పించినా నిజం కాదని తేలింది.
► ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Ugadi 2023:ఐశ్వర్య ప్రాప్తి కోసం సింహ రాశి వాళ్లు దీనిని ధరిస్తే మేలు..

Gujarat Assembly Elections 2022: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్‌

Gujarat Assembly Election 2022: గుజరాత్‌లో ప్రచారానికి తెర

పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ

Gujarat Assembly Election 2022: ఎవరి దశ తిరుగుతుంది?