మూత్ర పరీక్షతో టీబీ నిర్ధారణ

7 Jan, 2018 02:23 IST|Sakshi

     జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ వైద్యుల కొత్త ఆవిష్కరణ 

     ఎక్స్‌రే, రక్త పరీక్షల కంటే 100 శాతం ఎక్కువ కచ్చితత్వం 

     పరిశోధనా ఫలితాలు ‘సైన్స్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌’లో ప్రచురితం 

     నూతన విధానం త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి..

సాక్షి, అమరావతి: క్షయ (టీబీ–ట్యూబర్‌క్యులోసిస్‌) వ్యాధిని నిర్ధారించేం దుకు సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఇన్నాళ్లూ ఛాతీని ఎక్స్‌రే తీయడం లేదా రక్తపరీక్ష ద్వారా క్షయను నిర్ధారించేవారు. ఈ విధానాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి రక్తపరీక్షలతో వ్యాధి నిర్ధారణ జరిగేది కాదు. దీనివల్ల రోగులు వ్యాధి తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడా పరిస్థితికి చరమగీతం పాడనున్నారు. అమెరికాకు చెందిన జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ వైద్యులు కొత్తగా మూత్ర పరీక్ష ద్వారా టీబీని నిర్ధారించే మార్గాన్ని కనుగొన్నారు. ఎక్స్‌రే, రక్త పరీక్షల కంటే 100 శాతం ఎక్కువ కచ్చితత్వంతో వ్యాధిని నిర్ధారించవచ్చని నిరూపించారు. ఈ వివరాలు సైన్స్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. 

25 శాతం కేసులు భారత్‌లోనే... 
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది టీబీ బారినపడి మరణిస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త నిర్ధారణ విధానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కఫం పరీక్ష కూడా టీబీ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఇప్పటిదాకా పాటిస్తున్న విధానాలు చాలా జాప్యంతో కూడుకున్నవి. పైగా పెద్దమొత్తంలో ఖర్చు కావడంతో పేద దేశాల్లో చాలామంది రోగులు టీబీ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసుల్లో 25 శాతం కేసులు భారతదేశంలోనే నమోదవుతున్నట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ(సీడీడీఈపీ) వెల్లడించడం గమనార్హం.

త్వరలోనే అందుబాటులోకి... 
టీబీ నిర్ధారణ కోసం రూపొందించిన కొత్త విధానం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాజా పరిశోధనల్లో ‘హైడ్రోజెల్‌ నానో కాజెస్‌’అనే విధానం ద్వారా మూత్ర పరీక్ష చేసి, దీంతో ట్యూబర్‌ క్యులోసిస్‌ బ్యాక్టీరియాను కొనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా బాక్టీరియా తీవ్రతతోపాటు మనిషిలోని ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి)ని కూడా అంచనా వేయొచ్చు. దీనికోసం జెన్‌ ఎక్స్‌పర్ట్‌ మెషీన్లను ఉపయోగించారు. దాదాపు 8 ఏళ్లపాటు సాగించిన పరిశోధనలు ఫలించాయని, టీబీ నిర్ధారణలో ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నింటి కంటే అత్యంత కచ్చితమైన ఫలితాలు వచ్చాయని కొత్త ఆవిష్కరణను ప్రచురించిన జర్నల్‌ ప్రకటించింది. ఇందులో అల్సెండ్రా లూసిని అనే సైంటిస్ట్‌ కీలక పాత్ర పోషించారు. 

రాష్ట్రంలో విజృంభిస్తున్న క్షయ 
ఆంధ్రప్రదేశ్‌లో టీబీ కేసులు ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక టీబీ రోగి నుంచి ఏడాదిలో కనీసం 12 మందికి ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్టు తేలింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యాధిగ్రస్తుడి నుంచి నలుగురికి వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో 130 మందికి కొత్తగా టీబీ వ్యాధి సోకుతున్నట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. మన రాష్ట్రంలో ఏటా దాదాపు 10,000 మంది టీబీ బాధితులు బయటపడుతున్నారు. దేశంలోనే ఎక్కువ మంది హెచ్‌ఐవీ బాధితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. హెచ్‌ఐవీ బాధితుల్లో 80 శాతం మందికి టీబీ సోకుతోంది. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడడం, పోషకాహారం తీసుకోవడం వంటి వాటితో క్షయ రోగం నుంచి విముక్తి పొందవచ్చు. 

మరిన్ని వార్తలు