101 అన్నమయ్య కీర్తనల ఆలాపన

16 Sep, 2013 04:09 IST|Sakshi

పాయకరావుపేట, న్యూస్‌లైన్: శ్రీప్రకాష్ విద్యా సంస్థ వేదికగా కోఠి స్టిర్స్  ప్రపంచ రికార్డు సాధనకు 101 అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ విద్యా సంస్థలో చదువుతున్న కోఠి సిష్టర్స్ (లక్ష్మీ శ్వేత ,సత్య అక్షోభ) ఆదివారం ప్రపంచ రికార్డు సాధన, అన్నమాచార్య తత్వ ప్రచారం ధ్యేయంగా ఈ సాహసానికి పూనుకున్నారు. అదివో అల్లదివో... కీర్తనతో మొదలై జయమంగళం... అనే కీర్తన వరకూ 101 కీర్తనలను ఐదున్నర గంటలు నిర్వరామంగా ఆలపించి సరికొత్త ప్రపంచ రికార్డుకు ప్రయత్నించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్ర జాలికుడు, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త, చింతా శ్యామ్‌కుమార్ (శ్యామ్ జాదూగర్) మాట్లాడుతూ చిన్న వయస్సులోనే కోఠి సిస్టర్స్ 101 అన్నమయ్య గీతాల ను ఆలపించి ప్రపంచ రికార్డుకు ప్రయత్నించడం ఆనందంగా ఉందన్నారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్న శ్రీప్రకాష్ విద్యాసంస్థల కృషి అభినందనీయమన్నారు. సినీ నటుడు కె.ఆర్.జె. శర్మ, ఎలమంచిలి సీఐ కె.రామారావు మాట్లాడుతూ ఎన్నో రోజుల పాటు సాధన చేసిన వీరు ప్రపంచ రికార్డు నెలకొల్పి ఈ ప్రాంతానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.

శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి అన్ని రంగాల్లో విజయం సాధించేలా బోధన ఇస్తున్నామని చెప్పారు. కోఠి సిస్టర్స్‌తో పాటు తల్లిదండ్రులు గౌతమ్, రామలక్ష్మమ్మలను విద్యా సంస్ధల కరస్పాండెంట్ సీహెచ్‌వికె నరసింహారావు అభినందించారు. 101 కీర్తనలు ఆలాపన చేసినట్లు స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసి కోఠి సిస్టర్స్‌కు ధ్రువపత్రాలు అందజేసి సుజలపుత్రి అనే బిరుదు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు