అంగడి బొమ్మలు

24 Oct, 2017 15:51 IST|Sakshi

వీరే కాదు బేతంచర్లకు చెందిన 15 ఏళ్ల బాలిక, కర్నూలు నగరంలోని బంగారుపేటకు చెందిన 17 ఏళ్ల బాలిక, పాములపాడు మండలానికి చెందిన వేంపెంట గ్రామానికి చెందిన ఒక నెల శిశువును తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇలాగే విక్రయించారు.  

ఎమ్మిగనూరు మండలం నగరూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కర్నూలు నగరంలోని ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా గర్భిణి అని తేలింది. ఆమెను లోక్‌అదాలత్‌ జడ్జి ఎదుట హాజరుపరచగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రజ్వల హోమ్‌కు తరలించారు.  

కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన 14  ఏళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి (ఇతనికి అప్పటికే వివాహమైంది) మోసం చేశాడు. సోషల్‌ వర్కర్‌కు ఈ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను గుర్తించి తిరుపతిలోని చైల్డ్‌హోమ్‌కు తరలించారు.  

గోనెగండ్ల మండలం చింతలమాను వీధికి చెందిన ఏడాది పాపను తల్లిదండ్రులు ఆర్థిక కారణాలతో విక్రయించారు. ఈ విషయం తెలిసి డీసీపీయూ వారు పాపను స్వాధీనం చేసుకుని కర్నూలులోని శిశుగృహలో ఉంచారు.  

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కోసిగి, కౌతాళం, డోన్, కృష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, కల్లూరు మండలాల్లో పేదరికాన్ని ఆసరగా చేసుకుని దళారులు చెలరేగిపోతున్నారు. అభం శుభం తెలియని అమాయక ఆడపిల్లలను మోసం చేసి వ్యభిచార కూపాలకు తరలిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ఈ ప్రాంతాల నుంచి 160 మంది దాకా ఆడపిల్లలను కొనుగోలు చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబయి, పూణే నగరాల్లో ఉండే రెడ్‌లైట్‌ ఏరియాల్లోని వ్యభిచార కూపాల్లో అమ్మేశారు. గత రెండేళ్ల నుంచి 17 మందిని ఇలా కొనుగోలు చేసి విక్రయించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. వీరుగాక తప్పిపోయిన పిల్లలు 59 మంది ఉన్నారు. వీరిలో సగం మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని సమాచారం.  

ఆర్థిక కారణాతోనే..
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏటా కరువు పరిస్థితులు నెలకొనడం సహజం. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి పేదలు బతుకుదెరువు కోసం ముంబయి, బెంగళూరు, గుంటూరు వంటి నగరాలకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. దీనికితోడు నిరక్షరాస్యత, మూఢనమ్మకాల కారణంగా కొన్ని కుటుంబాల్లో అధిక సంతానం ఉంది. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు, కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని దళారులు రంగంలోకి దిగుతున్నారు. ఆడపిల్లలున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి పిల్లలను తీసుకెళ్తున్నారు. వారిని ముంబయి, బెంగళూరులలోని మహానగరాల్లో పెద్దల ఇంట్లో పనిలో పెడతామని నమ్మబలుకుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులకు కొంత సొమ్ము అడ్వాన్స్‌గా ముట్టచెబుతున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నా హాయిగా ఉంటారన్న నమ్మకంతో దళారుల బుట్టలో పడుతున్నారు. వారి పిల్లలను దళారుల చేతిలో పెట్టడమే తరువాయి ముంబయి రైలెక్కిస్తున్నారు.  

రైల్వేపోలీసుల చొరవతో...
ఇలా దళారుల వలలో పడి రైలెక్కిన చిన్నారుల్లో చాలా మంది వ్యభిచార కూపాలకు చేరుతున్నారు. అదృష్టం బాగుంది కొందరు పిల్లలు రైలు ప్రయాణంలో రైల్వే పోలీసుల కంట పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఇలా దళారుల నుంచి రక్షించబడిన కేసుల్లో అధిక శాతం రైల్వేపోలీసుల చొరవ వల్లేనంటే అతిశయోక్తి కాదు.  

బాలల రక్షణకు కఠిన చట్టాలున్నాయి
లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడి, లైంగిక హింస చేస్తే దానిని అత్యాచారంగానే పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు ఏడు సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. బాలలకు సహాయం, పునరావాసం కల్గించేందుకు ప్రత్యేక బాలల పోలీసుల బృందం ఫిర్యాదు అందిన తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేసి, బాలలకు ఆదరణ, రక్షణ కల్పించేందుకు షెల్టర్‌ హోమ్‌కు తరలిస్తాము. ఈ మేరకు కర్నూలులో స్వధార్‌హోమ్‌ ఉంది. అలాగే తిరుపతి, మహబూబ్‌నగర్‌లలో విద్యాభ్యాసం చేసేందుకు ప్రత్యేక పాఠశాలలు, అనంతపురంలో కాలేజ్‌ ఎట్‌ హోమ్‌లు ఉన్నాయి. ఇక్కడ బాలికలకు విద్యా,వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.      టి.శారద, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ అధికారి  

మరిన్ని వార్తలు