20 లోగా మార్గదర్శకాలు

14 May, 2014 01:02 IST|Sakshi
20 లోగా మార్గదర్శకాలు

 ఉద్యోగుల ఆకాంక్షలకు తగినట్లుగానే ఉంటాయి     అనిల్ గోస్వామి హామీ
 
హైదరాబాద్: ఉద్యోగ సంఘాల ఆకాంక్షలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి బృందాలు మంగళవారం వేర్వేరుగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో గోస్వామిని కలిసి వినతిపత్రాలు సమర్పించారుు. సంఘాల ప్రతినిధులు చెప్పిన విషయాలను హోం శాఖ కార్యదర్శి సావధానంగా విన్నారు. ఈనెల 19 లేదా 20న మార్గదర్శకాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన జరుగుతుందని, తదుపరి రెండు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉద్యోగుల పంపిణీ చేస్తాయన్నారు. 371(డీ)లో పేర్కొన్న జోన్ల సంఖ్య పెంపు లేదా కుదింపు కోరుతూ ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు అందజేయవచ్చునని చెప్పారు.

అందరికీ ఆప్షన్లు ఇవ్వాలి: సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు

ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రస్థాయి నియామకాల్లో ఉద్యోగాలు సంపాదించి సచివాలయం, హెచ్‌వోడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జోనల్ వ్యవస్థ వర్తించదు. వారిని స్థానికత ఆధారంగా కాకుండా ఆప్షన్ల మేరకు ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి.జిల్లాల నిష్పత్తిలో కాకుండా జనాభా నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరగాలి.రాజధానిలో ఉన్న ఉద్యోగుల పిల్లల స్థానికతను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్లు ఇవ్వాలి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన పిల్లలు సీమాంధ్రకు వెళ్లాలనుకుంటే అక్కడ వారిని ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించాలి.విభజనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఉండే అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలి.

స్థానికత ఆధారంగా విభజించాలి: తెలంగాణ ఉద్యోగ సంఘాలు

స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలి. తాత్కాలిక కేటాయింపునకు కూడా స్థానికతనే ఆధారంగా తీసుకోవాలి.సీమాంధ్రలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపించాలి. అదే విధంగా తెలంగాణ నుంచి సీమాంధ్రకు పంపించాలి.ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో 610 జీవో, గిర్‌గ్లానీ కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి.టీచర్లకూ ఆప్షన్లు ఇవ్వాలి: పీఆర్టీయూ, ఎస్టీయూవిభజన నేపథ్యంలో టీచర్లు సొంత జిల్లా, రాష్ట్రానికి వెళ్లడానికి వీలుగా ఆప్షన్ సౌకర్యం కల్పించాలి. దంపతులైన టీచర్లకూ ఈ సౌకర్యం ఉండాలి.కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి.సీమాంధ్రకు లోటు బడ్జెట్ ఉన్నందున ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బంది రాకుండా కేంద్రం సహకరించాలి.
 
 

మరిన్ని వార్తలు