2011 గ్రూప్‌–1 మెయిన్స్‌ మెరిట్‌ జాబితా విడుదల

20 Dec, 2017 03:30 IST|Sakshi

ఇంటర్వ్యూలకు 294 మంది ఎంపిక

సుదీర్ఘకాలం న్యాయ వివాదాల మధ్య నలిగిన గ్రూప్‌–1

కమిషన్‌ తప్పిదాలే కారణం

సాక్షి, అమరావతి : ఏపీపీఎస్సీ.. గతంలో నిర్వహించిన 2011 గ్రూప్‌–1 మెయిన్స్‌ మెరిట్‌ జాబితాను 294 మంది అభ్యర్థులతో మంగళవారం విడుదల చేసింది. 2011 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో విచారణ జరిగి తీర్పు వెలువడ్డా చివరి వరకు పలు వివాదాలు దీన్ని వెన్నాడుతూనే వచ్చాయి. ఎట్టకేలకు 152 పోస్టులకు ఇంటర్వ్యూలకు పిలుస్తూ 294 మంది పేర్లతో జాబితా వెలువడింది. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వివరాలను వెబ్‌సైట్లో పొందుపరుస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ ఎదురుగా ఆర్‌అండ్‌బీ భవనంలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా, డీఎస్పీ తదితర పోస్టులకు ఎంపికైనవారు శరీరదారుఢ్య పరీక్షలకు విశాఖపట్నంలోని మెడికల్‌ బోర్డు, దివ్యాంగులు సంబంధిత మెడికల్‌ బోర్డు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. 

న్యాయవివాదాలతో సుదీర్ఘ కాలం..
2011, నవంబర్‌లో 312 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2012, మే 27న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమ్స్‌ ‘కీ’లో 13 తప్పులు ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఏడింటిని సవరించిన కమిషన్‌ ఆరింటినీ వదిలేసింది. దీనిపై అభ్యర్థులు కొందరు ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే 2012, సెప్టెంబర్‌ 18 నుంచి 30 వరకు మెయిన్స్‌ పరీక్షలు, తర్వాత ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ప్రిలిమ్స్‌ కీపై ట్రిబ్యునల్‌ తీర్పు ఇవ్వగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుగా ఉన్న ఆరు ప్రశ్నలపై యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నుంచి నివేదిక కోరుతూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో తప్పులున్న ఆరు ప్రశ్నలను రద్దు చేసి మిగిలిన 144 ప్రశ్నల మేరకు మెరిట్‌ లిస్టు రూపొందించి మళ్లీ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్‌ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించలేదు.

రెండోసారి మెయిన్స్‌ నిర్వహించినా తప్పులే
అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ (172), తెలంగాణ (140) రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు వేర్వేరుగా మెయిన్స్‌ పరీక్షను చేపట్టాయి. క్యారీఫార్వర్డ్‌ అంటూ పోస్టుల సంఖ్య 172 నుంచి 152కు కుదించుకుపోయింది. మెయిన్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించినా తప్పులే దొర్లాయి. పేపర్‌–5 150 మార్కులకు నిర్వహించగా 42 మార్కులకు ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. దీనిపై అభ్యంతరాల మేరకు కమిషన్‌ వాటిని తొలగించి 108 మార్కులకే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మళ్లీ వారం రోజుల్లోనే ఆ జాబితాను తొలగించి తప్పుగా వచ్చిన 42 మార్కుల ప్రశ్నలనూ కలిపి మొత్తం 150 మార్కులకు స్కేలింగ్‌ విధానంలో అర్హుల జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో ఉన్న 28 మంది అభ్యర్థుల పేర్లు ఈ రెండో జాబితాలో లేకపోగా కొత్తగా మరికొంతమందికి అవకాశం వచ్చింది. దీంతో వారంతా కమిషన్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్‌ మొదటి జాబితాను మాత్రమే ఉంచాలని, లేదంటే మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. దీనిపై ఏపీపీఎస్సీ మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో కమిషన్‌ తాజాగా రెండో జాబితాను ఖరారు చేసి ఇంటర్వ్యూలకు రంగం సిద్ధం చేసింది.

మరిన్ని వార్తలు