227వ రోజు పాదయాత్ర డైరీ

3 Aug, 2018 02:44 IST|Sakshi

02–08–2018, గురువారం
చెందుర్తి క్రాస్, తూర్పుగోదావరి జిల్లా  

‘నీరు – చెట్టు’తో ఎకరానికైనా నీరందించారా?
ఈ రోజు ఉదయం కాపు సోదరులు, కాపు ప్రముఖులు, అక్కచెల్లెమ్మలు వందలాదిగా తరలివచ్చి నా పట్ల చూపిన అభిమానం, నమ్మకం నన్ను కదిలించాయి. వారి కృతజ్ఞతాభినందనల మధ్య పాదయాత్ర మొదలుపెట్టాను.  కౌలు రైతులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో మరో కన్నీటి కథ వినిపించిందీరోజు. నన్ను కలిసిన నూకరత్నం అనే సోదరి, ఆమె కొడుకు శ్యాంబాబు.. నన్ను చూడగానే కంటతడిపెట్టారు. బలహీనవర్గానికి చెందిన వారి వ్యథ ఎవరినైనా కదిలించేదే. మల్లవరానికి చెందిన ఆమె భర్త జోగిరాజుకు కొంత పొలం ఉండేదట. దాంతో పాటు మరింత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడట.

ఇద్దరు కూతుళ్లు, కొడుకు భవిష్యత్తు కోసం.. ఆ తండ్రి తలపెట్టిన వ్యవసాయ యజ్ఞంలో అడుగడుగునా గండాలేనట. తనకున్న భూమిలోనే ఎకరం అమ్మేసి ఎలాగోలా కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడట. మిగిలిన భూమి పాసు బుక్కులు పెట్టి పంట రుణం, బంగారం తాకట్టు పెట్టి మరింత రుణం తీసుకుని వ్యవసాయం చేసిన ఆ రైతన్నకు.. బాబుగారి రుణమాఫీ హామీ మిణుకుమిణుకుమనే ఆశను రేపింది. బాబుగారు అధికారంలోకి వచ్చాక వచ్చిన హుద్‌హుద్‌ తుపానుకు పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. పంట నష్టపరిహారం వస్తుందనుకున్నాడట. పోనీ.. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ అయినా అవుతుందని ఆశ పెట్టుకున్నాడట. ఆ రెండూ జరగలేదు. ఓ వైపు తీవ్ర నిరాశ, నిస్పృహలు కుంగదీస్తుంటే.. మరోవైపు అప్పులతో అవమానభారం. విరక్తి చెందిన ఆ అన్నదాత దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడట.

ఓ వైపు.. కుటుంబ పెద్దను కోల్పోయిన దుఃఖం నిలువునా కూల్చేసింది. మరోవైపు.. రైతులు ఎవరైనా చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. వారి వైపు కన్నెత్తయినా చూడలేదు. అన్ని ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని ఎంతగా తిరిగినా కనికరించే నాథుడే లేకపోయాడు. వారి కన్నీటి కథ విని గుండె బరువెక్కింది. ఎంత క్షోభ అనుభవించి ఉంటే.. ఆ రైతన్న అంతటి కఠోర నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఇప్పుడా కుటుంబ సభ్యుల గతేంటి? వారెట్లా బతకాలి? జీవితం మీదే విరక్తి కలిగేంతటి తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న రైతన్నలకు కనీస విశ్వాసం కలిగించలేని ఈ ప్రభుత్వమెందుకు? ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకుండా ఆ విధివంచిత కుటుంబాలను మోసం చేస్తున్న ఈ పాలకులను ఏమనాలి?  

నీరు–చెట్టులో భాగంగా ఆ ఊరి కోదండరాముని చెరువులో జరిగిన అక్రమాలను తాటిపర్తి గ్రామస్తులు వివరించారు. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా చెరువును తవ్వేసి.. మట్టిని, గ్రావెల్‌ను దోచేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. ఈ రోజు మధ్యాహ్న శిబిరానికి కూతవేటు దూరంలో ఉన్న చేబ్రోలు పెద్ద చెరువులోనే.. గతంలో చంద్రబాబుగారు స్వయంగా నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టిమరీ దోపిడీ పర్వానికి తెరలేపారు. ఇదే నియోజకవర్గంలోని దాదాపు 25 చెరువుల్లో ఈ పథకం ముసుగులో అక్షరాలా వంద కోట్లకు పైగా కొల్లగొట్టారట.

చేసిన పనికి నీరు–చెట్టు పథకం కింద బిల్లు తెచ్చుకుంటారట. అదే పనిని చూపించి.. ఉపాధి హామీ పథకంలో బిల్లులు చేసుకుంటున్నారట. ఆ పనినే చూపించి.. ఇరిగేషన్‌ విభాగం నుంచి చెరువుల అభివృద్ధి పేరుతో బిల్లులు చేసుకుంటారట. ఒకే పనికి రకరకాల పథకాల పేర్లతో ప్రజా సొమ్మును కొల్లగొట్టేయడమే కాకుండా.. తవ్వేసిన మట్టిని, గ్రావెల్‌ను, ఇసుకను అమ్మేసుకుంటూ.. ప్రభుత్వానికి కట్టాల్సిన నామమాత్రపు రుసుమును కూడా ఎగవేస్తున్నారట. దోపిడీ విశ్వరూపం చూడాలంటే నీరు–చెట్టు పథకం తీరుతెన్నులు గమనిస్తే చాలని.. నన్ను కలిసిన గ్రామస్తులు అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘నీరు–చెట్టు’ అంటూ దాదాపు రూ.13,859 కోట్ల బిల్లులు చేసుకున్నారు. ఈ పథకంతో అదనంగా ఒక్క ఎకరానికయినా నీరందించారా? అలా అందించకపోగా.. ఉన్న ఆయకట్టుకు సైతం నీరందకపోవడం నిజం కాదా? చెరువుల నుంచి తవ్విన మట్టిని, గ్రావెల్‌ను, ఇసుకను అమ్ముకుని దాదాపు రూ.12 వేల కోట్లకు పైగా దోచేశారన్నది నిజం కాదా? దోపిడీ పథకంగా మారిన నీరు–చెట్టు వల్ల రాష్ట్రంలోని వేలాది చెరువులు నిరుపయోగమై.. తాగు, సాగు నీరు దొరకని పరిస్థితి ఏర్పడటం, భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లు ఎండిపోయాయని ఆవేదన చెందుతున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?  

-వైఎస్‌ జగన్‌       

మరిన్ని వార్తలు