277వ రోజు పాదయాత్ర డైరీ

4 Oct, 2018 02:55 IST|Sakshi

03–10–2018, బుధవారం 
నెల్లిమర్ల మొయిద జంక్షన్, విజయనగరం జిల్లా

ప్రజల ప్రాణాలకన్నా మోసపు లెక్కల ప్రచారమే మీకు ముఖ్యమా బాబూ?
నా పాదయాత్ర ఈ రోజంతా నెల్లిమర్ల నియోజకవర్గంలోనే సాగింది. విమానాశ్రయం పేరుతో భూదోపిడీకి పథకం వేసిన భోగాపురం ఇక్కడే ఉంది. ఇదే జిల్లాకు చెందిన నాటి విమానయాన మంత్రినే ప్రధానాస్త్రంగా వాడుకున్నాడు ప్రభుత్వ పెద్ద. పక్కనే ఉన్న తమ బినామీలు, ఎంపీలు, మంత్రుల పేరిట ఉన్న భూముల జోలికి పోకుండా.. అమాయక రైతుల భూములపై పడ్డారు. ఆ రైతన్నలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు.  
విజయనగరం జిల్లాలోనే సముద్రతీర ప్రాంతం ఉన్న ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల. ఇక్కడి మత్స్యకార సోదరుల కష్టాలు వింటుంటే మనసెంతో బరువెక్కింది. తీర ప్రాంతంలో ఉన్న రసాయన పరిశ్రమలు.. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి అలాగే వదిలేయడం వల్ల మత్స్య సంపద అంతరించిపోతోంది. దాన్నే నమ్ముకున్న మత్స్యకార సోదరులకు ఉపాధి లేకుండా పోతోంది. చేపల వేట తప్ప మరోటి తెలియని ఆ సోదరులు దూర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడుతోంది. పరిశ్రమలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజలను పరిరక్షించాల్సిన పాలకులు ఏమైపోయారు? వారి అలసత్వం, లాలూచీ వ్యవహారాలే ఈ దుస్థితికి కారణం. హుద్‌హుద్‌ తుపానుకు దెబ్బతిన్న ఆ మత్స్యకార గ్రామాలను పునరుద్ధరిస్తానని, తుపాన్లకు తట్టుకుని నిలబడే ఇళ్లను నిర్మిస్తానని.. సాక్షాత్తు ముఖ్యమంత్రిగారే హామీలిచ్చారట. కానీ ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. తన సాంకేతిక పరిజ్ఞానంతో హుద్‌హుద్‌ తుపానును సైతం కట్టడి చేశానని గొప్పలు చెప్పుకొన్న ముఖ్యమంత్రికి.. తానిచ్చిన హామీలు నెరవేరక తుపానుకు చేదు గుర్తులుగా మిగిలిన ఈ గ్రామాలు, ఇక్కడి ప్రజలు కనపడలేదేమో! 

పాదయాత్రలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బందిని చూసి బాధేసింది. వారికి 365 రోజుల్లో ఒక్క పూటా సెలవుండదట. వారికీ కుటుంబాలు ఉంటాయి కదా.. వారానికి ఒక్క రోజైనా విరామం లేకపోతే ఎలా? 
జరజాపుపేట గ్రామంలో ఉదయం తండోపతండాలుగా జనం కలిశారు. మా గ్రామాన్ని పంచాయతీగానే ఉంచండి.. నగర పంచాయతీలో కలపకండి.. అంటూ మొరపెట్టుకున్నారు. ఆ గ్రామంలో అత్యధికులు జూట్‌ మిల్లు కార్మికులు, దినసరి కూలీలు, నిరుపేదలు. అలాంటి గ్రామాన్ని నగర పంచాయతీలో కలపడం వల్ల వారికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేకపోగా.. వారి జీవన వ్యయం మాత్రం బాగా పెరిగిపోయింది. ఇంటి పన్నులు, నీటి పన్నులు.. ఆఖరుకు ఖాళీ స్థలాలకు కూడా పన్నులు భారీగా వేస్తున్నారట. నిరుపేదలు చిన్న ఇల్లు కట్టించుకోవాలన్నా.. ఫీజుల కింద భారీ మొత్తంలో కట్టాల్సి వస్తోంది. మున్సిపాల్టీగా చేయడం వల్ల ఉపాధి పనులు కూడా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కొనసాగుతున్న మున్సిపాల్టీలో సమస్యలపై నిర్లక్ష్యం, అలసత్వమే తప్ప.. ఏ కోశానా అభివృద్ధి ఛాయలే కనపడటం లేదని వాపోయారు.  

నెల్లిమర్లలో సభ జరుగుతుండగా ప్రసవ వేదనపడుతున్న గర్భిణిని తీసుకెళుతున్న ఆటో జనం మధ్యలో ఇరుక్కుపోయింది. 108లో ఎంతో క్షేమంగా వెళ్లాల్సిన ఆ తల్లి కష్టం కదిలించింది. ఉపన్యాసాన్ని ఆపి.. ఆటోకు దారివ్వండని ప్రజల్ని కోరగానే.. నా మాటను మన్నించి మానవత్వాన్ని చాటారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని 108 వాహనాల్లో మూడో వంతు మూలన పడటం వాస్తవం కాదా? ముక్కుతూ మూల్గుతూ తిరుగుతున్న మిగతా వాటిలో ఆక్సిజన్, అత్యవసర మందులూ కొరవడటం నిజం కాదా? వాస్తవాలిలా ఉండగా.. 95శాతం వాహనాలు సక్రమంగా సేవలందిస్తున్నట్టు మీ డ్యాష్‌ బోర్డులో చూపడం ఎవర్ని మోసం చేయడానికి? మీకు ప్రజల ప్రాణాలకన్నా మీ మోసపు లెక్కల ప్రచారమే ముఖ్యమా?
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు