2 రోజులు.. 4 లక్షల మంది

23 May, 2020 04:20 IST|Sakshi

ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేరిన ప్రయాణికులు 

2,824 బస్సు సర్వీసులు తిప్పిన సంస్థ 

సీట్ల తగ్గింపుతో ఆక్యుపెన్సీ 64 శాతం 

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం 

జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: సర్వీసులు ప్రారంభమైన రెండ్రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో నాలుగు లక్షల మందికి పైగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో ఆర్టీసీ 2,824 బస్సు సర్వీసుల్ని నడిపింది. కోవిడ్‌–19 నిబంధనల నేపథ్యంలో భౌతికదూరం పాటించడానికి బస్సుల్లో సీట్ల సంఖ్య తగ్గించింది. దీంతో ఆక్యుపెన్సీ 64 శాతంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులకు కలిపి ఆర్టీసీ ఆదాయం రూ. కోటి దాటింది. శుక్రవారం 1,375 సర్వీసులు తిప్పాలని ప్రణాళికలు రూపొందించగా, 1,341 బస్సుల్ని నడిపారు. వీటిలో 1,003 బస్సులకు కౌంటర్లు, బుకింగ్‌ పాయింట్ల ద్వారా, 338 బస్సులకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేశారు. అయితే గుంటూరు జిల్లాలో బుకింగ్‌ పాయింట్ల ద్వారా టికెట్లు జారీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,612 బుకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో అనుకున్న వాటికన్నా అధికంగా బస్సులు తిప్పారు. 

► గురువారం సర్వీసులు ప్రారంభించే రోజుకి 1,683 బస్సుల్ని తిప్పాల్సి ఉండగా, 1,483 సర్వీసుల్ని మాత్రమే ఆర్టీసీ నడిపింది. 3.78 లక్షల కిలోమీటర్ల మేర ఈ బస్సులు తిరిగాయి. 
► తొలి రోజు రూ.71 లక్షలు ఆదాయం రాగా, ఇందులో రూ.10.91 లక్షల ఆదాయం ఆన్‌లైన్‌ ద్వారా సమకూరింది.
► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మొత్తానికి ఏప్రిల్‌ నెల జీతం 90 శాతం మేర చెల్లించాలని సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
► ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్ట్‌లకు మాత్రమే రాయితీ పాస్‌లను అనుమతించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు