ఇటుకలపై 5 శాతం పన్ను

2 Jan, 2014 01:08 IST|Sakshi
ఇటుకలపై 5 శాతం పన్ను

సాక్షి, హైదరాబాద్: పేదల కోసం నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇకపై మరింత భారం కానుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇటుకలపై పన్ను వసూలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా గడచిన నాలుగేళ్లుగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ లెక్కలను ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖను వాణిజ్య పన్నుల శాఖ కోరుతోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు అనుమతులు మంజూరు చేసిన ఇళ్లు, ఫ్లాట్ల నిర్మాణాలపైనా ఆరా తీస్తోంది. వీటి ఆధారంగా ఎంత ఇటుక వాడారు? వాటి ఖరీదు ఎంత? వాటికి ఎంత పన్ను చెల్లించాలనే లెక్కలు వేయాలని అంచనా వేస్తోంది. ఫిబ్రవరిలోగా ఇందుకు సంబంధించిన అన్ని వివరాలూ పంపాలని జిల్లా అధికారులను వాణిజ్య పన్నుల శాఖ విభాగం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గడచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్టు అంచనా. వీటికి తోడు మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు అనుమతి ఇచ్చిన ఫ్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు 47 లక్షల వరకూ ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
 
 మేజర్ గ్రామ పంచాయతీల్లోని నిర్మాణాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని లెక్కగడుతున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ లెక్కల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటికీ 10 వేల వరకూ ఇటుక వాడుతున్నారు. అపార్‌‌టమెంట్ నిర్మాణాలకు 50 నుంచి 80 వేల ఇటుకల అవసరం ఉంటుంది. వీటికి ఎక్కడి నుంచి ఇటుకలు తెస్తున్నారనే వివరాలు అధికారుల వద్ద లేవు. అయితే ఇటుకలపై 5 శాతం అమ్మకం పన్ను వసూలు చేయాలనే నిబంధన మాత్రం ఉంది. మూడేళ్ల క్రితం వరకూ ఒక్కో ఇటుక రూ. 3.50 ఉండేది. మట్టి తవ్వకాలపై ఆంక్షలు విధించడంతో రూ. 5కి పైగా పెరిగింది. ఈ లెక్కన ఇందిరమ్మ ఇళ్లకే కోట్ల రూపాయల విలువైన ఇటుకను వాడారు. అపార్ట్‌మెంట్లు, పట్టణాలు, పంచాయతీల్లో నిర్మాణాలను కలుపుకుంటే, ఈ నాలుగేళ్లలో సుమారు రూ. 500 కోట్ల అమ్మకం పన్ను రాబట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నాలుగేళ్ల పన్ను వసూలు విషయమై ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు