ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలపై పన్ను పిడుగు

6 Nov, 2023 06:24 IST|Sakshi

రూ.లక్ష కోట్లకు షోకాజు నోటీసులు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్‌టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అక్టోబర్‌ 1 తర్వాత భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్‌ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్‌ కంపెనీలు, జీఎస్‌టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్‌ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్‌ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆగస్ట్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్‌11, డెల్టా కార్ప్‌ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్‌క్రాఫ్ట్‌ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్‌టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు.

దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్‌11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్‌ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి.

మరిన్ని వార్తలు