7వ రోజు పాదయాత్ర డైరీ

14 Nov, 2017 03:29 IST|Sakshi

13–11–2017, సోమవారం
ఇడమడక, వైఎస్సార్‌ జిల్లా 

మద్యం మహమ్మారిని పారదోలతాం
ఏడు రోజుల పాదయాత్ర అనంతరం వైఎస్సార్‌ జిల్లా శివారుకు చేరుకున్నాను. వైఎస్సార్‌ జిల్లాలోని దువ్వూరులో ఈ ఉదయం బయల్దేరి, 13.8 కిలోమీటర్లు నడిచి ఇడమడక గ్రామ సమీపానికి వచ్చాను. మధ్యలో పసుపు రైతులు వచ్చి కలిశారు. బుడ్డ శనగ, మినుము, ధనియాల రైతుల పరిస్థితి ఎలా ఉందో వీరి పరిస్థితీ అలాగే ఉంది. పంట చేతికి రాకముందు ధర ఆకాశంలో, చేతికి వచ్చేసరికి పాతాళంలో. క్వింటాల్‌కు రూ.15 వేలున్న పసుపు ధర.. పంట రైతు చేతికి రాగానే రూ.5,800కు పడిపోయింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనానికి నాకు కొన్ని ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. పంట రాకముందే ఈ ప్రభుత్వం కనీస ధరను ప్రకటించకపోవడం, కనీస ధర రానప్పుడు ప్రభుత్వమే పంటలను కొనకపోవడం, మార్కెట్లో ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోతే వాటిని స్థిరీకరించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం, వ్యాపారులు మార్కెట్‌ ధరలను తమ ఇష్టం వచ్చినట్లు ఆడించడం, ప్రభుత్వ పెద్దలే ఈ నాటకంలో భాగస్వాములు కావడం. వీటికి చెక్‌ చెప్పాలి. 

వెంకుపల్లెమిట్ట గ్రా మం గుండా వెళుతున్నప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన వెంకటసుబ్బయ్య కలిశాడు. నాన్నగారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టమని ఎవ రూ ఒత్తిడి చెయ్యలేదనీ, ఇప్పుడు ఒక్క రోజు ఆలస్యమైనా వంద రూపాయలు ఫైన్‌ వేస్తున్నారని గోడు వెళ్ళబోసుకున్నాడు. స్థిరమైన ఆదాయ వనరులు లేక బతుకు వెళ్లదీస్తోన్న ఎస్సీ, ఎస్టీల నుంచి ముక్కుపిండి కరెంటు బిల్లులు వసూలు చేయడం ఈ ప్రభుత్వానికి భావ్యమేనా? కొం తమంది దగ్గర జరిమానాలతో కూడిన రూ.20 వేల నుంచి 30వేల రూపాయల బిల్లులు వసూలు చేయడం సమంజసమేనా? అందుకే రాజన్న రాజ్యం వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని భరోసా ఇచ్చాను.  

మూడిళ్లపల్లె గ్రామానికి చెందిన ఆవుల నాగలక్ష్మి మరో ముఖ్య సమస్యను నా ముందు పెట్టింది. మద్యం వల్ల ఆమె కాపురం ఛిన్నాభిన్నమవుతోంది. ఆమె చిన్న ఉద్యోగం చేస్తోంది. భర్త వ్యవసాయం చూసుకుంటున్నాడు. అయితే, భార్య జీతం, వ్యవసాయం మీద వచ్చే ఆదాయం మొత్తం అతని తాగుడుకే ఖర్చయిపోతోంది. ‘అన్నా, నువ్వు తప్పుకుండా ఆ మద్యం మహమ్మారిని లేకుండా చేయాలన్నా’ అని వేడుకుంది. ‘మన ప్రభుత్వం నీలాంటి ఎందరో అక్కచెల్లెళ్ల ఆవేదనను తçప్పకుండా తీర్చుతుందమ్మా’ అని భరోసా ఇచ్చాను.  

కానగూడూరులో బీసీ సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం జరిగింది. బీసీలను ఇబ్బంది పెడుతోన్న పేదరికం, ప్రోత్సాహలేమి గురించి వాళ్లు బాధపడ్డారు. చంద్రబాబు మాదిరిగా ఇస్త్రీ పెట్టెలు, కుల వృత్తుల కిట్లు పంపిణీ చెయ్యడానికి పరిమితం కాకుండా, ప్రతి కుటుంబం పేదరికం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మూడు చర్యలు తీసుకోవాలి. మొదటగా, ఇద్దరు పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికీ అమ్మఒడి పథకంలో భాగంగా సంవత్సరానికి రూ.15 వేలు ప్రోత్సాహకంగా ఇస్తాము. కాలేజీ స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అమలు పరచడమేకాక, ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి  రూ.20 వేలు స్టైపెండ్‌ అందజేస్తాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందజేస్తాం. ఇందుకు స్పష్టమైన ప్రణాళిక నా దగ్గర ఉంది. బీసీల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే వాటిని అమలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. పాదయాత్ర పూర్తవగానే బీసీ గర్జన సభ పెట్టి, బీసీల సమస్యలకు పరిష్కారాలతో బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తాము. 

కేజీ నుంచి పీజీ వరకూ పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టి... మూడున్నరేళ్లవుతున్నా ఇప్పటివరకూ పట్టించుకోకుండా, బీసీ విద్యార్థుల చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అనేక కోతలు పెట్టారు, ఆంక్షలు విధించారు.  

ఇది బీసీ వర్గాలను వంచించడం కాదా? ఇదేనా బీసీ వర్గాల మీద మీకున్న ప్రేమ? మీ దృష్టిలో బలహీనవర్గాలు కేవలం ఓటు బ్యాంకేనా? బలహీన వర్గాల సంక్షేమంపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? 

అన్నయ్యకు ఆప్యాయంగా.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం రాజుపాళెం మండలం టంగుటూరులో వైఎస్‌ జగన్‌కు ఆ గ్రామానికి చెందిన పసుపురైతు నంద్యాల ఊపయ్య, ఆయన సోదరి సుభద్ర  సంగటి, ఉల్లిపాయ తినిపించారు.  
- వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు