నేటి నుంచి 8 గంటల విద్యుత్ కోత!

8 Oct, 2013 02:21 IST|Sakshi

 సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యోగులు, సిబ్బంది సమ్మె ఫలితంగా ఎన్టీటీపీఎస్‌లో 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రాయలసీమ థర్మల్ పవర్, సీలేరు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి స్తంభిం చింది. విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. సబ్‌స్టేషన్లకు వస్తున్న విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
 
 విద్యుత్ కోత వేళలు ఇవీ...
 జిల్లా వ్యాప్తంగా మంగళవారం 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధించాలని విద్యుత్ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని గ్రామాలు, పట్టణాలతోపాటు విజయవాడలోనూ కోత అమలులో ఉంటుంది. ఈ కోతలను నిరవధిక సమ్మె ఆపే వరకు కొనసాగిం చాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. విజయవాడలో సోమవారం ఆరు గంటల కోత విధించడంతో రిజర్వాయర్లకు నీరు అందక మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ జి.పండాదాస్ దృష్టికి విద్యుత్ కోతలు తొలగేవరకూ సాయంత్రం నీటి సరఫరా నిలిపివేయాలని అధికాలను ఆదేశించారు. విద్యుత్‌కోతల వల్ల నగరంలోని చిన్న ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవడంలేదని తెలిసింది. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వాహకులు జనరేటర్ల సంఖ్యను పెంచుకున్నారు.
 
 కోతల కారణంగా ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడిందని వైద్యులు తెలిపారు. వేసవిలో విద్యుత్ కోతలతో తీవ్ర నష్టాలను చవిచూసిన పరిశ్రమలు తిరిగి సంక్షోభంలోకి చేరుతున్నాయి. ఆటోనగర్‌లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉండదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 5 వేల పరిశ్రమలు పడే అవకాశం ఉంది. 65 రోజులుగా బంద్‌లతో అంతంత మాత్రంగా సాగుతున్న వ్యాపారాలపైనా విద్యుత్‌కోతల ప్రభావం పడనుంది. కోతలు కారణంగా ఏటీఎంలు, బ్యాంకులు సరిగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అనేక ఏటీఎంల వద్ద ‘అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ తగి నంత అందుబాటులో లేకపోవడంతో డీజిల్ ఇంజిన్లతో రైళ్లను నడుపుతున్నారు. దీంతో మూడు నాలుగు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ప్రశాంతి, రత్నాచల్, తిరుపతి  తదితర రైళ్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం కూడా అనేక రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది.
 
 దుర్గగుడి, ప్రభుత్వాస్పత్రికి
 విద్యుత్ కోతల నుంచి మినహాయింపు
 దసరా ఉత్సవాలు జరుగుతున్నందున దుర్గగుడికి, అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రి, హెడ్‌వాటర్ వర్క్స్, మిల్క్‌ప్రాజెక్టు తదితర సంస్థలకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలో విద్యుత్‌శాఖలో 2000 మంది కాంట్రాక్టు సిబ్బంది పని చేస్తున్నారు. వీరంతా సబ్‌స్టేషన్లు వద్ద ఆపరేటర్లుగా, కంప్యూటర్ విభాగం, సాఫ్ట్ బిల్లింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వీరు కూడా సమ్మె బాట పట్టడంతో ఇబ్బందులు మరింత పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు