వైద్యం, విద్యపై ఏపీ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ: కొమ్మినేని

13 Dec, 2023 17:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సామాన్యులకు అత్యంత ఆవశ్యకాలైన వైద్యం, విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతున్న దృష్ట్యా వైద్య సేవలు ప్రజలకు సమర్ధవంతంగా అమలు కావాలని సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రయివేట్ హాలులో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి మెడికల్ సూపరింటెండెంట్‌ల సదస్సులో పౌర సంబంధాలు, మీడియా నిర్వహణ అంశంపై ఆయన మాట్లాడారు.

స్థానికంగా వుండే ప్రధాన మీడియాతో, సోషల్ మీడియాతో సత్సంబంధాలు కలిగి వుండాలని ఈ సందర్భంగా చైర్మన్ పేర్కొన్నారు. సమాచారం అందించడంలో జాప్యాన్ని నివారించడం ద్వారా వైద్య అధికారులు, మీడియా తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన వైద్య సేవల సమగ్ర సమాచారాన్ని మీడియాకు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం నెలకొల్పగలమని ఆయన పేర్కొన్నారు.

వైద్య సదుపాయాలపై మీడియా లేవనెత్తిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజల్లోని అపోహలను తొలగించవచ్చన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్ని జాగృతం చేసేందుకు మీడియా సహకారం తీసుకోవాలని సూచించారు. వైద్య రంగంలో వోస్తోన్న ఆధునిక పద్దతుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం సాధారణ ఆసుపత్రుల్లో కల్పించిన అత్యంత ఆధునిక పరికరాల గురించి, వాటి పనితీరు వల్ల సామాన్య జనానికి కలిగే ప్రయోజనాలను తెలియ చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగించ వచ్చని చైర్మన్ వివరించారు. 

ఇటీవల తాము శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగాంగా "ఉద్దానంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన "కిడ్నీ వ్యాధుల పరిశోధన సంస్థ" ఆసుపత్రిని సందర్శిస్తే ప్రయివేటు కార్పొట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండడం, అక్కడి వైద్యులు చక్కటి సేవలు ప్రజలకు అందించడం తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. ఇటువంటి అంశాలపై ప్రచారం ఎక్కువ చేయాల్సి ఉందన్నారు. గాలిలో కాలుష్యం పేరుకుపోతుండడం ఆందోళనకరంగా మారి ఊపిరితిత్తులకు సంబంధించిన పలు వ్యాధులు తలెత్తుతుండడం పట్ల ప్రజల్లో అవగాహన  పెరిగేలా కృషి చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో వైద్య విద్య డైరెక్టర్ డా.రఘునందన రావు, అదనపు డైరెక్టర్ డా. టి. సూర్యశ్రీ, జాయింట్ డైరెక్టర్ కె.అరుణ, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, అక్కౌంట్స్ అధికారి ఎం.ఎస్. ఎన్. మూర్తి,  డి.పి.ఓ ఎం. లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు