సర్కారు సిబ్బందికి.. ఏసీబీ వణుకు

23 Nov, 2013 03:16 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  తుపాను వర్షాలు, చలిగాలులతో జిల్లా ప్రజలు, రైతులు వణుకుతుంటే.. ప్రభుత్వ సిబ్బంది మాత్రం ఏసీబీ భయంతో వణికిపోతున్నారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఇటీవలి కాలంలో ఏసీబీ పంజా విసురుతోంది. మున్సిపల్ కమిషనర్లు, పోలీసులు సైతం దాని దెబ్బకు విలవిల్లాడుతున్నారు. మూడు నెలల్లోనే నాలుగు దాడులు.. ఏడు అరెస్టులతో మిగతా సిబ్బంది ఠారెత్తిపోతున్నారు. ఫార్మాలిటీస్ చెల్లించనిదే పనులు జరగని పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చి చేయి తడిపేందుకు ప్రయత్నించే సాధారణ ప్రజలను ‘మీకో దండం’.. అంటూ వెనక్కి పంపేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతితో విసిగిపోయిన వారికి ప్రస్తుతం ఏసీబీ ఆపద్బాంధవిగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. శుక్రవారం సీడీపీవోపై వల పన్ని పట్టుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఇది నాలుగో దాడి కాగా.. మూడు నెలల క్రితం దాడుల పరంపర మొదలైంది.
   ఆగస్టు 20న.. స్థానిక వైఎస్‌ఆర్ కల్యాణ మండపం పాత లీజుదారు నుంచి లంచం తీసుకుంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ పట్టుబడ్డారు. అవినీతిలో మునిగి తేలుతున్న మున్సిపాలిటీలో ఏకంగా కమిషనరే దొరికిపోవడం, అతనితోపాటు సీని యర్ అసిస్టెంట్ పద్మనాభం కూడా అరెస్టు కావడంతో ఉద్యోగులు అదిరిపోయారు. ఒక మున్సిపల్ కమిషనర్ దొరికిపోవడం జిల్లాలో ఇదే ప్రథమం కావడంతో ప్రజల్లోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
   అక్కడికి నెలన్నర వ్యవధిలో.. సెప్టెంబర్ 30న ఏసీబీ మళ్లి వల వేసింది. ఈసారి ఏకంగా రక్షక భటులే వలలో చిక్కుకున్నారు.  యాక్సిడెంట్‌కు గురైన ఒక వాహనాన్ని విడుదల చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఆజాద్‌ను ఆశ్రయించాడు. దాంతో వల పన్నారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటుండగా స్టేషన్ రైటర్‌తోపాటు మరో కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులే ఇలా చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లలో జరిగే అక్రమాలను బట్టబయలు చేసింది.
   20 రోజుల తర్వాత..నవంబర్ 20న సీన్ పాలకొండకు మారింది. ఈసారి వంతు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌ది. ఇంటి ప్లాన్ ఆమోదానికి లంచం తీసుకుంటూ ఆయన దొరికిపోయారు. ఇటీవలే నగర పంచాయతీగా మారిన పాలకొండకు తొలి కమిషనర్‌గా నియమితుడైన నాగభూషణరావు ఇలా అరెస్టు కావడం విశేషం. 3 నెలల వ్యవధిలో ఇద్దరు మున్సిపల్ కమిషనన్లు పట్టుబడటం మున్సిపాలిటీల్లో జరుగుతున్న అవినీతి గుట్టు విప్పింది.
   తాజాగా.. నవంబర్ 22.. శుక్రవారం.. పిల్లలకు పౌష్టికాహారం సరఫరా చేసే ఐసీడీఎస్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ నుంచి లంచం తీసుకుంటున్న కోటబొమ్మాళి సీడీపీవో కె.ఉమాదేవి, అందుకు సహకరించిన ఆమె భర్త ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. రవాణా బిల్లు మంజూరుకు సునీల్‌కుమార్ అనే ఆపరేటర్ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ శ్రీకాకుళంలోని తన ఇంట్లోనే ఆమె ఏసీబీకి దొరికిపోయారు.
        ఇలా ఏసీబీ దాడులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ సిబ్బంది హడలిపోతున్నారు. ఇవాళ వీరు.. రేపెవరో.. అని చర్చించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ‘ఫార్మాలిటీస్’ పూర్తి చేయనిదే ఏ పనీ జరగదు.. ఏ ఫైలూ కదలదు. దీనికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అదే అలవాటుతో ఎవరైనా చేయి తడపడానికి ప్రయత్నిస్తే.. బాబూ.. మీకో దండం.. మీ పని చేసిపెడతాంగానీ ముందు  ఇక్కడి నుంచి వెళ్లిపోండని సిబ్బంది బతిమాలుతున్నారు. ఇది మంచి మార్పే అయినా.. ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది.. ఏసీబీ దాడుల పరంపర కొనసాగడం.. పట్టుబడినవారిపై చర్యలు తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది.

మరిన్ని వార్తలు