విభజన సాకుతో వేతనాలివ్వరా? | Sakshi
Sakshi News home page

విభజన సాకుతో వేతనాలివ్వరా?

Published Sat, Nov 23 2013 3:08 AM

Why do not you pay wages showing State bifurcation, supreme court takes on bihar and jharkhand

  • ఉద్యోగులను ఆకలితో మాడుస్తారా?
  • బీహార్, జార్ఖండ్‌లకు సుప్రీం అక్షింతలు
  • అంతులేని బాధ్యతారాహిత్యమిది 
  • రాజ్యాంగపు ఆత్మనే గాయపరిచారు
  • గినియా పందుల్లా ఉద్యోగులపై ప్రయోగాలా?
  • వారెలా బతుకుతారని కూడా ఆలోచించరా?
  • మీ బాధ్యతకు కావాలనే తిలోదకాలిచ్చారు
  • తక్షణం వేతనాలివ్వాలంటూ ఆదేశాలు
  • న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన విభేదాలను సాకుగా చూపుతూ రెండు కార్పొరేషన్లకు చెందిన ఉద్యోగులకు వేతనాలివ్వనందుకు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గట్టిగా తలంటింది. జార్ఖండ్ హిల్ ఏరియా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ (జాల్కో), బీహార్ హిల్ ఏరియా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ (బాల్కో) ఉద్యోగులకు ఏళ్ల తరబడి వేతనాలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వారందరికీ తక్షణం వేతనాలు చెల్లించాల్సిందిగా న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ‘మీ విభేదాలను సజావుగా పరిష్కరించుకోకపోగా, ఉద్యోగులను ఆకలితో మలమల మాడే దశకు తీసుకెళ్తారా?’ అంటూ ఆ రాష్ట్రాలను, కార్పొరేషన్లను ఈ సందర్భంగా తూర్పారబట్టింది. ఉద్యోగుల జీవనోపాధి ఎలా అని అవి కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదంటూ దులిపేసింది. వారి ఇక్కట్లను ఏ మాత్రమూ పట్టించుకోకుండా పూర్తిగా చేతులు దులిపేసుకున్నాయంటూ నిశితంగా విమర్శించింది. ‘‘ఆదర్శ యజమాని అనే భావనకు రెండు రాష్ట్రాలూ, సంబంధిత కార్పొరేషన్లూ ఉద్దేశపూర్వకంగానే తిలోదకాలిచ్చాయి.ఇందులో అణుమాత్రం కూడా సందేహం లేదు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
     
    ‘‘చట్టప్రకారం బీహార్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించారు. తద్వారా వాటి మధ్య తలెత్తే విభజన వివాదాలను సజావుగా పరిష్కరించే బాధ్యత కేంద్రానిది. కానీ అలా చేయకపోగా ఉద్యోగులంటే ఏదో గినియా పందులన్నట్టుగా వారిపై ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేశారు. అంతులేని బాధ్యతారాహిత్యం ఇందులో అడుగడుగునా కన్పిస్తోంది. ఆ రాష్ట్రాలు, సంబంధిత కార్పొరేషన్ల నిర్లక్ష్యానికి, జడత్వానికి, కప్పదాటు వైఖరికి ఇది నిదర్శనమనడం ఎంతమాత్రమూ తప్పు కాబోదు’’ అంటూ ఆక్షేపించింది. ఇది చట్టబద్ధంగా ఎంతమాత్రం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. ‘‘ఇది నిస్సందేహంగా న్యాయ విరుద్ధమైన చర్య. రాజ్యాంగపు ఆత్మనే గాయపరిచే చర్య. ఇలా చేసే హక్కు ఎవరికీ లేదు’ అని స్పష్టం చేసింది. ‘సుపరిపాలన కొనసాగే ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఇలా చేయబోదు. నిర్మాణాత్మక, ప్రగతిశీల భావనతో చురుకైన పాత్ర పోషించడం ప్రభుత్వాల బాధ్యత’ అంటూ దిశానిర్దేశం చేసింది.

Advertisement
Advertisement