ఏసీబీ వలలో మరో చేప

14 Sep, 2013 03:07 IST|Sakshi

 ధర్మారం, న్యూస్‌లైన్ : రెవెన్యూ కార్యాలయంలో ప్రతి పనికి లంచం పుచ్చుకుంటూ రైతులను, ప్రజలను వేధిస్తున్నారు. గతం లో లంచం కోసం డిమాండ్ చేసిన ధర్మారం వీఆర్వో జుంజుపల్లి రాజ య్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా దొంగతుర్తి వీఆర్వో గా పనిచేస్తూ ధర్మారం ఇన్‌చార్జి వీఆర్వోగా వ్యవహరిస్తున్న నక్క రాజయ్యను శుక్రవారం రాత్రి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలి పిన వివరాలు.. దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల రమేష్ తన తండ్రి మల్లయ్య పేర ఉన్న 20 గుంటల భూమిని గిఫ్ట్‌డీడ్ చేయించుకున్నాడు. ఆ భూమిని జమాబందీ చేయాలని వీఆర్వో రాజయ్యను ఆశ్రయించగా రూ.5వేలు డిమాండ్ చేశాడు.
 
 రూ.2500 ఇస్తానని చెప్పిన రమేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు శుక్రవారం రాత్రి 8గంటలకు రమేష్ వీఆర్వో రాజయ్య ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వగా, ఆయన వాటిని జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌తోపాటు సిబ్బంది రాజయ్యను పట్టుకున్నారు. అతడు ధర్మారంలో ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యాలయంలో రమేష్‌కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. లంచం డబ్బులను స్వాధీనం చేసుకొని రాజయ్యపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వీవీ.రమణమూర్తి, శ్రీనివాస్‌రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 కావాలనే ఇరికించారు
 తనకు డబ్బులు అక్కరలేదని చెప్పినప్పటికీ రమేష్ బలవంతంగా జేబులో పెట్టాడని, ఇంతలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారని వీఆర్వో రాజయ్య పేర్కొన్నాడు. తమ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తనను కావాలనే ఇరికించాడని ఆరోపించారు. సదరు ఉద్యోగి సూచన మేరకే జమాబందీ చేశానని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు.
 

మరిన్ని వార్తలు