రెండో రోజూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె | Sakshi
Sakshi News home page

రెండో రోజూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె

Published Sat, Sep 14 2013 2:33 AM

The second day of the current employees strike

సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలో ని విద్యుత్ ఉద్యోగులు రెండవ రోజు శుక్రవారం కూడా సమ్మెలో పాల్గొనడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని 2,500 మంది ఉద్యోగులు వందశాతం సమ్మెలో పాల్గొన్నారు. వసూళ్లు, బిల్లులను రూపొందించే పని పూర్తిగా అటకెక్కింది. విద్యుత్ బ్రేక్‌డౌన్లను పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేయాల్సి వచ్చింది.

తిరుపతి సర్కిల్‌లో తిరుపతి అర్బన్, రూరల్, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు సబ్ డివిజన్లతో పాటు కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ల లో ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. తిరుపతి డిస్కం కార్యాలయం ఎదుట జేఏసీ కన్వీనర్ డీఈ మునిశంకరయ్య, చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేట్, ఎస్‌ఈ కార్యాలయ ఉద్యోగులు, నగరంలోని ఏఈలు, లైన్‌మన్లు, కార్యాలయాల సిబ్బంది ధర్నా చేశారు. సమైక్య వాదాన్ని వినిపిస్తూ పాటలు పాడారు. జిల్లాలో ఎస్‌ఈ మినహా ఏ ఒక్కరూ విధులకు హాజరుకాకపోవడంతో విద్యుత్ శాఖ పరిపాలన పూర్తిగా స్తంభించింది.

మాస్క్‌లతో నిరసన

డిస్కం కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్, డిగ్గీరాజ, కోదండరాం, హరీశ్‌రావు మాస్క్‌లు ధరించి వారు ఏ రకంగా రాష్ట్ర విభజనకు కుట్ర పన్నారనేది వివరిస్తూ స్క్రిప్ట్‌తో నాటకం వేశారు. సోనియా, కేసీఆర్, డిగ్గీరాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయే రంగాల్లో ప్రధానంగా విద్యుత్ సంస్థ ఉందని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి సమ్మెకు ఏపీఎన్‌జీవోలు ఉద్యోగ సంఘం జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. వారు సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసు నుంచి ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని, సంఘీభావం తెలిపారు.

 ఫ్యూజ్‌కాల్స్‌పై సమ్మె ప్రభావం

 విద్యుత్ సమ్మెతో జిల్లా వ్యాప్తంగా ఫ్యూజ్‌కాల్స్ సర్వీసులు నిలిచి పోయాయి. ఈ ఫిర్యాదులు తీసుకునేవారు లేరు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసే నాథుడే లేడు. కాంట్రాక్టు ఉద్యోగులకు వీటి నిర్వహణ చేతగాకపోవటంతో సమ్మె ముగిసేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం గృహ సర్వీసులకే కాకుండా హెచ్.టీ పారిశ్రామిక సర్వీసులు, వాణిజ్య, వ్యవసాయ సర్వీసుల నిర్వహణపైనా పడుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement