ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

19 Sep, 2018 10:09 IST|Sakshi

అమరావతి: స్థలం రిజిస్ట్రేషన్‌ చేయటానికి లంచం అడిగిన అమరావతి సబ్‌రిజిస్ట్రార్‌ ఏసీబీకి చిక్కిన సంఘటన మంగళవారం అమరావతిలో చోటుచేసుకుంది. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా జి.కొండూరుకు చెందిన మేడసాని శుభాకర్‌కు అమరావతి మండలం వైకుంఠపురంలో సర్వే నంబరు 6–83లో 29.5 సెంట్ల భూమి ఉంది. ఆ భూమికి అతని చెల్లెలుకు రిజిస్ట్రేషన్‌ చేయటానికి అమరావతి సబ్‌ రిజిస్ట్రార్‌ సయ్యద్‌ బాజిద్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో సదరు రిజిస్టర్‌ చేయటానికి 4 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేయగా, అందుకు శుభాకర్‌ ఒప్పుకుని సోమవారం రిజిస్ట్రార్‌ పూర్తిచేసుకున్నారు. మంగళవారం రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్‌ తీసుకోవటానికి వచ్చేటప్పుడు లంచం చెల్లించాల్సి రావటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

విజయవాడకు తరలింపు
ఏసీబీ అధికారులు ముందుగా వేసిన పథకం ప్రకారం శుభాకర్‌ నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ బాజిద్‌ సూచన మేరకు ఆయన ప్రైవేట్‌ అటెండర్‌ చింతాబత్తిన ప్రసాద్‌కు లంచం ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. చింతాబత్తిన ప్రసాద్‌ లంచం తీసుకోవటం రుజువు కావటంతో అందుకు కారణమైన సబ్‌రిజిస్ట్రార్‌ బాజిద్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి ఇద్దరిని విజయవాడకు తరలిం చారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ ఫిరోజ్, సిబ్బంది పాల్గొన్నారు. సంఘటన జరిగిన వెంటనే  ఫిర్యాదుదారుడు మేడసాని శుభాకర్‌ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అమరావతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2010 సెప్టెంబరు 16వ తేదీన అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ డీవీ అప్పారావు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు