ఎసీబీ వలలో వెదురుకుప్పం ఆర్‌ఐ

8 Aug, 2014 03:52 IST|Sakshi

వెదురుకుప్పం: వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చంద్ర  గురువారం మధ్యాహ్నం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి కథనం మేరకు మండలంలోని దామరకుప్పం గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలు పోగొట్టుకున్నాడు. రామచంద్రారెడ్డి కుమారుడు అత్తూరు రాజేంద్రరెడ్డి ఈ మేరకు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారించి పాసుపుస్తకాలు బస్సులో పోగొట్టుకున్నట్లు నిర్ధారించారు.

పాసు పుస్తకాల జిరాక్సు కాపీలతో పాటు పోలీసులు ఇచ్చిన సర్టిఫికెట్‌తో వెదురుకుప్పం తహసీల్దార్ ఇంద్రసేనకు డూప్లికెట్ పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. దీంతో తహసీల్దార్ కింది స్థాయి సిబ్బందికి సంబంధిత ఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫైల్ సిద్ధం చేయడానికి  రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఏవో కుంటిసాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తూ రాజేంద్రరెడ్డిని వేధించాడు. దీంతో విసిగి వేసారిపోయిన రాజేంద్రరెడ్డి తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు రాజేంద్రరెడ్డికి డబ్బులు ఇచ్చి ఆర్‌ఐకు ఇవ్వాలని సూచించారు.

గురువారం మధ్యాహ్నం ఆర్‌ఐ చంద్రకు రూ.3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఆర్‌ఐని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో సీఐలు రామకిషోర్,చంద్రశేఖర్‌రెడ్డి,లక్ష్మీకాంత్‌రెడ్డి,సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో అధికారులు అవినీతికి పాల్పడినా,డబ్బులు డిమాండ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నా సెల్ ః9440446190, 9440446120,9440446138, 9440446193,9440808112 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శంకర్‌రెడ్డి కోరారు.
 
రెవిన్యూ అధికారుల్లో గబులు
 
వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజులుగా సిబ్బంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ నాయకులు కూడా ఈ విషయూన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆర్‌ఐను పట్టుకోవడంతో సిబ్బందిలో గుబులు పట్టుకుంది. కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలియడంతో వీఆర్వోలు పత్తా లేకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన సిబ్బందిలో నెలకొంది.
 

మరిన్ని వార్తలు