మాకు నగలే కావాలి

8 Jan, 2020 12:31 IST|Sakshi
ఖాతాదారులకు సర్దిచెబుతున్న పోలీసులు

యాదమరిలో బ్యాంక్‌ వద్ద ఖాతాదారుల ధర్నా  

ఆందోళనకారుకు సర్దిచెప్పి పంపిన పోలీసులు  

చిత్తూరు, యాదమరి : ‘మాకు మా బంగారు నగలే కావాల’ని మంగళవారం యాదమరిలో ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు ధర్నా చేశారు. యాదమరి ఆంధ్రాబ్యాంకులో చోరీ అయిన బంగారు నగలకు సంబంధించి ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగదు చెల్లిస్తామన్నారు. అందుకు ససేమిరా అంటున్న ఖాతాదారులు మంగళవారం బ్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. తమకు నగదు వద్దని.. నగలే కావాలని ధర్నా నిర్వహించారు. చోరీకి గురైన నగలకు సంబంధించి గ్రాముకు రూ.2,600 ఇస్తామని సోమవారం బ్యాంక్‌ అధికారులు చెప్పడంతో ఖాతాదారులు నగదు వద్దు నగలు కావాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడదామని బ్యాంకు అ«ధికారులు సర్దిచెప్పి పంపారు.

దీనిపై మంగళవారం బ్యాంక్‌ అధికారులు స్పందించలేదు. దాంతా ఖాతాదారులు బ్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. అధికారులను లోనికి వెళ్లనీయకుండా గేటుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ పురుషోత్తం రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ఖాతాదారులతో, బ్యాంక్‌ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 17న బ్యాంకు డీజీఎం స్థాయి అధికారులు, ఖాతాదారులతో సమావేశం నిర్వహించి చర్చిస్తారని పోలీసులు హామీ ఇవ్వడంతో ఖాతాదారులు ఆందోళన  విరమించారు. 

మరిన్ని వార్తలు