కార్యకర్తలే కిరాయికి..

23 Mar, 2019 09:18 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఈ తంతు సర్వసాధారణమే అయినా.. ఈ ఏడాది అన్ని పార్టీలకు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారడంతో ప్రచారంలో ప్రజల సంఖ్యను ఎక్కువగా చూపి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారి కూలీలు ఆయా పార్టీలకు కార్యకర్తలుగా మారారు.     

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రచార జోరు ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరికొకరు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడిదే ఎంతో మంది పేదలకు ఉపాధి మార్గంగా మారింది. వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకుల వెంట తిరుగుతూ లబ్ధి పొందుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారాన్ని సానుభూతి పరులు నిర్వహిస్తుంటారు. అయితే రానురాను ఆ పద్ధతి తగ్గిపోతోంది.

సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇలా ఏ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు నిర్వహించాలన్నా డబ్బిచ్చి జనాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి. కార్యకర్తల సమావేశాలకు వచ్చే జనాలను కూడా కాసులివ్వాల్సి వస్తోంది. దీంతో పార్టీల కార్యక్రమాలు పేదలకు ఉపాధిగా మారాయి. వీళ్లందరినీ తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి మేస్త్రీగా వ్యవహరిస్తున్నాడు. రాజకీయ పార్టీలు పంపే వాహనాల్లో వీరంతా ఆయా ప్రాంతాలకు తరళివెళుతున్నారు. ఉదయం 8 గంటలకు నాయకులు సూచించిన చోటుకు చేరుకునే జనం ఆపై వారు చెప్పినట్లు నినాదాలు చేస్తూ రోజంతా పార్టీ జెండాలు మోస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి..
కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 5000 మందికి పైగా ప్రచార కూలీలుగా పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నా పేదలకు మాత్రం కొన్ని రోజులైనా ఇలా ఉపాధి దొరకడం హర్షణీయం. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 నుంచి 600 మంది వరకు ఇదే పద్ధతి అవలంభిస్తున్నట్లు తెలిసింది. ఇక యువత, ఆటో కార్మికులు సైతం అధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు.

వీరికి రోజుకు రూ.250 నుంచి రూ.400, మరి కొందరు భోజనాలు పెడుతున్నారు. మరి కొందరు బైక్‌లకు పెట్రోల్‌ పోసి, సాయంత్రం బిర్యానీ, రూ.300 ఇస్తున్నారు. బందరు నియోజకవర్గంలో గురువారం, శుక్రవారం కొన్ని పార్టీలు నిర్వహించిన నామినేషన్‌ కార్యక్రమానికి  రూరల్‌ మండలం కోన, కరగ్రహారం, సీతారమపురం, చిన్నాపురం, పోలాటతిప్ప, గోపువానిపాలెం, సుల్తానగరం తదితర ప్రాంతాల నుంచి బారీగా కూలీలు వెళ్లారు.

సమయం లేక.. 
పోలింగ్‌కు మరో కొద్ది రోజులు మాత్రమే సమయముండటంతో అభ్యర్థులే నియోజకవర్గమంతా తిరగడానికి తగినంత సమయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానిక నేతలతోనూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ జనం అవసరమవుతున్నారు. దీంతో కూలిచ్చి జనాన్ని తీసుకువచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్‌ లెవెల్‌ ఇన్‌చార్జి ద్వారా ఆ బూత్‌ పరిధిలో ప్రతి రోజూ ప్రచారం జరుగుతోంది.

దాంతో పాటు అభ్యర్థులు ఉదయం కొన్ని చోట్ల.. సాయంత్రం కొన్ని చోట్ల ప్రచారానికి వెళుతున్నారు. వారి వెంట భారీగా జనం ఉండేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే పేదలకు ఒక్కోక్కరికీ ఒక్క పూటకు రూ.100 నుంచి రూ.200 ఇచ్చి తీసుకువస్తున్నట్లు సమాచారం. కొన్ని పార్టీలు రోజంతా వారితో జనాలను తిప్పుకుని భోజనం పెట్టి రూ.300 చెల్లిస్తున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు