కుటుంబ కథా చిత్రం!

9 Jun, 2019 05:00 IST|Sakshi
కొడుకు, ఇద్దరు సోదరులతో పాశ్వాన్‌ (ఫైల్‌)

పాశ్వాన్‌ కుటుంబం నుంచి నలుగురు ఎంపీలు

పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే విశేషమే. బిహార్‌లోని లోక్‌జన్‌ శక్తి పార్టీ (ఎల్‌జీపీ) నేత రాంవిలాస్‌ పాశ్వాన్‌(73) ఈ ఘనత సాధించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్‌డీయే పొత్తుల్లో భాగంగా ఎల్‌జేపీకి ఆరు సీట్లు దక్కాయి. వాటిలో మూడు చోట్ల.. పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్, సోదరులు పశుపతి, రామచంద్రలు పోటీ చేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో పాశ్వాన్‌ పోటీ చేయలేదు. అయితే, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్డీయేలో ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాశ్వాన్‌తో కలిపి ఆయన కుటుంబంలో నలుగురు ఒకేసారి ఎంపీలుగా ఉన్నట్లవుతుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఏకకాలంలో ఎంపీలు కానుండటం పార్లమెంట్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్‌ కెక్కడం సహా పాశ్వాన్‌ రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు నెగ్గారు. 1977 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు.

మరిన్ని వార్తలు