ఒక్కో ఓటుపై రూ.700

9 Jun, 2019 04:52 IST|Sakshi

ఎన్నికల కోసం ఖర్చుపెట్టిన ఈసీ, రాజకీయ పార్టీలు

సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అధ్యయనం

దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ తెలిపింది.

ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది.

పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం..
మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్‌ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది.

ఎన్నికల రారాజు బీజేపీ..
ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది.

ధనప్రవాహం ఎక్కడిది?
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్‌ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్‌ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్‌ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్‌ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ తెలిపింది. అంటే భారత్‌ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు