ఆటలకు ప్రభుత్వం టాటా!

7 May, 2018 04:27 IST|Sakshi

రాష్ట్రంలో నాలుగేళ్లుగా క్రీడా రంగ అభివృద్ధికి చర్యలు శూన్యం 

ఫిజికల్‌ లిటరసీ పేరుతో రూ.100 కోట్ల దోపిడీ 

బడ్జెట్‌లో కేటాయించిన రూ.200 కోట్లకు లెక్కలు లేవు  

నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని క్రీడా సంఘాల డిమాండ్‌ 

విజయవాడ స్పోర్ట్స్‌: రాష్ట్ర్‌రంలో క్రీడాకారులనూ చంద్రబాబు సర్కార్‌ మాటలతో నాలుగేళ్లు మభ్యపెట్టింది. మరోవైపు క్రీడా సంఘాలతోనూ ఆటలాడుతూ పబ్బం గడుపుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసినట్లే.. బాబు వస్తే క్రీడా రంగానికి స్వర్ణయుగమే అని ప్రచారం చేశారు. వాస్తవానికి నవ్యాంధ్రలో ఒక్క అంతర్జాతీయ స్థాయి స్టేడియం కూడా లేదు. ఈ నాలుగేళ్లలో ఒక్క స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. స్థానిక క్రీడాకారులకు సాయమే లేదు. సీఎం చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులకు చివరకు నిరాశే మిగిలింది.
 
క్రీడా సంఘాల మధ్య చిచ్చు 
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో క్రీడాకారులకు ఇచ్చిన హామీల గురించి చర్చ జరగకుండా క్రీడా సంఘాల్లో చిచ్చు పెట్టారని క్రీడా నిపుణులు ఆరోపిస్తున్నారు. జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం వస్తే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ మేరకు జాతీయ క్రీడల నిర్వహణలో కీలకపాత్ర పోషించే రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌లో పదవులు దక్కించుకోవడం కోసం ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు రంగంలోకి దిగి పోటీపడ్డారు.

జాతీయ క్రీడల నిర్వహణను సాధించలేకపోయినా ఒలింపిక్‌ అసోసియేషన్‌ను మాత్రం రెండు ముక్కలు చేశారు. ఈలోగా రియో ఒలింపిక్స్‌ వచ్చాయి. అంతే.. ఏకంగా రాజధాని అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే నోబెల్‌ బహుమతి ఇస్తానని చెప్పి తనకు క్రీడలపై ఉన్న అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రాజధానిలో క్రీడా రంగం కోసం 1,200 ఎకరాలు కేటాయించామని చెప్పిన ప్రభుత్వం మరోవైపు ఉన్న స్టేడియాలను నిర్వీర్యం చేసింది. విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియాన్ని ప్రభుత్వ, అధికార పార్టీ కార్యకలాపాలకు వేదికగా మార్చేసింది. హెలిప్యాడ్‌ కోసం వినియోగిస్తూ దాన్ని ధ్వంసం చేసింది.   

రూ.కోట్లాది నిధులు గోల్‌మాల్‌ 
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది క్రీడలకు రూ.200 కోట్లు బడ్జెట్‌ కేటాయించింది. అయితే 13 జిల్లాల్లో జిల్లాకు కనీసం రూ.2 కోట్ల నిధులు కేటాయింపు కూడా జరగలేదని సమాచారం. రూ.కోట్ల పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు గోల్‌మాల్‌ చేసినట్లు క్రీడా సంఘాలే విమర్శిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతం ఇవ్వడానికి కూడా క్రీడలను ప్రభుత్వం అసరాగా చేసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా వికాస్‌ కేంద్రాల పేరుతో ఆ మైదానాల చుట్టూ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మార్చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని విషయంలో సింగపూర్, మలేషియా తదితర దేశాల పేర్లు చెప్పే చంద్రబాబు ప్రభుత్వం.. క్రీడల విషయంలో కెనడాను ఎంచుకుంది.

రాష్ట్రంలో దాదాపు 50 మందికి పైగా వ్యాయామ విద్యలో పీహెచ్‌డీలు చేసినవారు ఉంటే వాళ్లు పనికిరారని వ్యాయామ విద్యలో ఫిజికల్‌ లిటరసీ పేరుతో కెనడా నుంచి కొంత మందిని తీసుకొచ్చారు. దీనికోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చుపెట్టారని, భారీగా నగదు చేతులు మారిందని క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో తిరిగి అక్కడి కంటే మెరుగైన క్రీడా పాలసీ తీసుకొచ్చామని అధికారులు ప్రకటించారు. అయితే, ఆ పాలసీ ద్వారా ఎవరికి మేలు జరిగిందో చెప్పాలని క్రీడా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్పోర్ట్స్‌ అకాడమీల స్థాపన పేరుతో కర్ణాటకలోని ఓ సంస్థకు అజమాయిషీ అప్పజెప్పడం, నిధులు దుబారా చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  

ఉద్యోగాలు ఇక్కడ.. ఇంటర్య్వ్‌లు తెలంగాణలో 
ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) కోచ్‌ల నియామకం అంతా తెలంగాణలో నిర్వహించారు. అవి కూడా అవుట్‌సోర్సింగ్‌ నియామకాలు. క్రీడా సంఘాలను సంప్రదించకుండా.. కనీసం క్రీడలపై అవగాహన లేనివారిని, సర్టిఫికెట్లు కొనుక్కున్నవారికి కోచ్‌ల పోçస్టులు కట్టబెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కోచ్‌ల నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని పత్రికల్లో ఆధారాలతో సహా వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. కర్ణాటకలో కోచ్‌కు నెలకు రూ.39,960 ఇస్తుంటే.. మన రాష్ట్రంలో అది కేవలం రూ.17,500 మాత్రమే. ఈ మొత్తాన్ని మూడు నెలలకొకసారి ఇస్తున్నారంటే çక్రీడా రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.  

శ్వేతపత్రం విడుదల చేయాలి 
సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రాల క్రీడాకారులకు అందిస్తున్న నజరానాలు, ప్రోత్సాహకాలు రాష్ట్ర క్రీడాకారులకు అందించకపోవడం శోచనీయం. రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ప్రపంచ కప్‌లో పతకం సాధిస్తే పట్టించుకోకపోవడం బాధాకరం. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదం. క్రీడలపై అవగాహన లేని వ్యక్తులు క్రీడా మంత్రులుగా ఉండడం మన దౌర్భాగ్యం. గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన రూ.200 కోట్ల నిధులు ఖర్చులకు శ్వేతపత్రం విడుదల చేయాలి.  
–పున్నయ్య చౌదరి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపా«ధ్యక్షుడు, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు 
 
కొనుగోళ్లపై సీబీఐతో విచారణ చేయించాలి 
రాష్ట్రంలో రూ.కోట్లతో కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రి ఎక్కడ డంప్‌ చేశారు? ఎక్కడెక్కడికి పంపించారు? ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల కొనుగోలు లావాదేవీలపై, జల క్రీడల కోసం కొన్న బోట్ల కొనుగోళ్లపై సీబీఐతో విచారణ జరిపించాలి.  
–రంభా ప్రసాద్, ఆట్యపాట్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు