ఎల్లో మీడియాకు మంత్రి కాకాణి సవాల్‌.. చర్చకు సిద్ధంగా ఉన్నా..

17 Nov, 2023 16:56 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వడం  రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకం అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. దీని వల్ల నెల్లూరు జిల్లాల్లో 5517 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దున్నే వాడిదే భూమి అన్నట్లు సీఎం జగన్‌ రైతులకి హక్కులు కల్పించారన్నారు.

విష ప్రచారం చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. స్వయం ప్రకటిత మేధావులు అందరూ టీడీపీలోనే ఉన్నారు. వారు మాట్లాడిందే పచ్చ పత్రికలు రాస్తున్నాయి. కరువు మండలాలు ప్రకటనపై చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎవరు వస్తారో రండి’’ అంటూ మంత్రి సవాల్‌ విసిరారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ నిబంధనలు ప్రకారమే కరవు మండలాలు ప్రకటించాం. కావాలంటే నిబంధనల కాపీని రామోజీరావుకి రిజిస్టర్ పోస్ట్ అయినా పంపుతాను. మిడి మిడి జ్ఞానంతో రామోజీ వార్తలు రాయిస్తున్నారు.. సోమిరెడ్డి లాంటి మేధావులు ఈనాడుకు వార్తలు రాస్తున్నాడు. నెల్లూరు జిల్లాల్లో ఎన్ని కాలువలకీ నీరు ఇచ్చామో కుడా పురందేశ్వరికీ తెలీదు.. ఎన్ని కాలువలు ఉన్నాయో కుడా ఆమెకి తెలీదు. సోమిరెడ్డి లాంటి వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ ను ఆమె చదివి నవ్వులపాలయ్యింది. కరువు, వ్యవసాయం గురించి తెలియని లోకేష్ ట్విట్లు చేయడం సిగ్గు చేటు’’ అంటూ మంత్రి మండిపడ్డారు.

రైతులకు అన్ని విధాలుగా వైఎస్సార్‌సీపీ అండగా వుంది. ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేశ్‌ పాదయాత్రకు విముక్తి లభించింది. టీడీపీ- జనసేనకు సమన్వయం లేక స్టేజ్ మీదే కొట్టుకుంటున్నారు. చంద్రబాబుకు చేతగాని, అమలు చేయని పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
చదవండి: బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి

మరిన్ని వార్తలు