ఈ జంక్షన్‌లో నిత్యం టెన్షనే..

7 Jul, 2019 07:15 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై స్థానిక ఏడీబీ రోడ్డు సెంటర్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు వెళ్లేందుకు ఇది ముఖ్యమైన జంక్షన్‌. విజయవాడ, హైదరాబాద్‌ నుంచి వచ్చే భారీ వాహనాలు ఇక్కడి నుంచే కాకినాడ వైపు ఏడీబీ రోడ్డులోకి మళ్లుతాయి. అదే సమయంలో జాతీయ రహదారిపై అదుపు చేయలేనంత వేగంతో వాహనాలు దూసుకువస్తూండడంతో తరచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 28న హైదరాబాద్‌ నుంచి వస్తున్న ట్రాలీని విశాఖ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో లారీ నుజ్జవగా, ట్రాలీపై ఉన్న పెద్ద గ్రానైట్‌ రాయి రోడ్డుకు అడ్డంగా పడింది. రెండు రోజుల్లోనే గత నెల 30వ తేదీన ఇదే జంక్షన్‌లో వ్యాన్‌ ఢీకొని బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు పలు కార్లు, ఆటోలు, లారీలు ఈ సెంటర్‌లో ప్రమాదాలకు గురయ్యాయి. పలువురు అసువులు బాయగా, మరింతమంది క్షతగాత్రులుగా మిగిలారు.

విశాఖ నుంచి వస్తున్నవాహనాలతో..
ముఖ్యంగా విశాఖపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న వాహనాల కారణంగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలు కాకినాడ వైపు వెళ్లేందుకు ఇక్కడ ఏడీబీ రోడ్డు వైపు మలుపు తిరగాలి. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న వాహనాలు.. మలుపు తిరుగుతున్న వాహనాలను దూరం నుంచి గమనించే పరిస్థితి లేదు. విశాఖపట్నం వైపు జాతీయ రహదారి మలుపు తిరిగి ఉండటంతో దగ్గరకు వచ్చే వరకూ వాహనచోదకులు ఈ జంక్షన్‌ను గుర్తించలేకపోతున్నారు.

అంతేకాకుండా ఈ జంక్షన్‌లో విద్యుద్దీపాలు కూడా రాత్రి సమయంలో సరిగ్గా వెలగవు. తగినంత లైటింగ్‌ లేకపోవడం కూడా ఈ సెంటర్‌లో ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. గడచిన ఆరు నెలల్లో జరిగిన ప్రమాదాలనే పరిశీలిస్తే.. ఎక్కువగా విశాఖపట్నం నుంచి వస్తున్న వాహనాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు వాటిని నియంత్రించేవిధంగా చర్యలు తీసుకోవడం లేదు.

అసలు తరచుగా ఇక్కడే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని పరిశీలించడం లేదు. ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. స్థానికులు మాత్రం ఈ జంక్షన్‌లో ప్రమాదాలు జరగకుండా ఉండాలనే సంకల్పంతో భగవంతునిపై భారం వేస్తూ భారీ ఎత్తున పంచముఖాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, పూజలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు