‘క్రైస్తవం ఒక మతం కాదు.. జీవన విధానం’

20 Dec, 2019 19:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : మతాన్ని ప్రచారం చేసేందుకు ఇంగ్లీష్‌ మీడియం విద్య తెచ్చారని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. క్రైస్తవం ఒక మతం కాదని జీవన విధానమని స్పష్టం చేశారు. పాస్టర్‌లకు గౌరవ వేతనం 5 వేలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదని ప్రశసించారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. మన బడి నాడు- నేడు కార్యక్రమాలతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేలా సీఎం చర్యలు చేపట్టారన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల విద్యను తీసుకు రాబోతున్నామని పేర్కొన్నారు.

అమ్మ ఒడి ద్వారా జనవరిలో ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ కాబోతున్నాయన్నారు. నా మతం మానవత్వం, నా కులం ఇచ్చిన మాట నిలుపుకోవడమని సీఎం స్పష్టం చేశారని మంత్రి ప్రస్తావించారు. ఆరు నెలల్లో సీఎం జగన్‌ ప్రజారంజక పాలన అందించారని, సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేస్తున్నారని కొనియడారు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని గత పాలకులు హేళన చేస్తే.. వైఎస్‌ జగన్‌ దళితులకు తన క్యాబినెట్‌లో మంత్రి పదవులు ఇచ్చి పెద్దపీట వేశారని పేర్కొన్నారు.  అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నేత, సామాజిక సంస్కర్త సీఎం జగన్‌ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు