విక్రయించేందుకు వచ్చి.. పోలీసులకు చిక్కి.!

5 Apr, 2016 03:50 IST|Sakshi
విక్రయించేందుకు వచ్చి.. పోలీసులకు చిక్కి.!

ఆదోనిలో గుప్త నిధుల పేరుతో రైతును బురిడీకి యత్నించిన ముఠా
పంచలోహ విగ్రహాలను విక్రయించేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన ముఠా సభ్యులు
 

కర్నూలు: పంచలో విగ్రహాలను విక్రయించడానికి వచ్చిన ఓ ముఠా పోలీసుల వలలో పడ్డారు. ఆదోని పట్టణానికి చెందిన బోయ ఉరుకుందప్ప పొలంలో పెద్ద ఎత్తున ధనం ఉందని వెలికి తీస్తామని ముఠా సభ్యులు నమ్మించి అతని వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు విఫలయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

ఆ వివరాలు.. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ తహీర్, కర్నూలు పట్టణానికి చెందిన మహమ్మద్ షరీఫ్, షేక్ అలీ, నవాబు పేట అల్లాబకాష్ తదితరులు ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం బోయ ఉరుకుందప్ప పొలంలో పంచలోహ విగ్రహాలను పాతిపెట్టారు. బోయ ఉరుకుందప్ప, బోయ ఈరప్పలను కలిసి పలానా చోట టన్నుల కొద్ది గుప్త నిధులున్నాయని నమ్మబలికారు.

వాటిని వెలికి తీసేందుకు రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని పొలంలోకి వెళ్లి తవ్వకాలు జరిపి రెండు విగ్రహాలను వెలికి తీసి రైతులను నమ్మించారు. ఇంకా భారీ మొత్తంలో ఇక్కడ గుప్త నిధులున్నాయని, మిగిలిన డబ్బులు అప్పగిస్తే వాటిని కూడా వెలికి తీసి ఇస్తామని నమ్మించారు. బయట పడిన పురాతన వస్తువులను విక్రయించేందుకు కర్నూలుకు వచ్చి ముఠా సభ్యులంతా కల్లూరులోని నవాబ్‌పేట అల్లాబకాష్‌ను ఆశ్రయించి పోలీసులకు దొరికిపోయారు.
 
 పోలీసులకు ఇలా పట్టుబడ్డారు..
 
 బోయ ఉరుకుందప్ప పొలంలో తవ్వకాలు జరిపి వెలికితీసిన నాగదేవత, శివుడి విగ్రహాలు, 5 బంగారు వర్ణం కలిగిన బల్లేలు, ఇత్తడి బిందె, ఇత్తడి మూతతో పాటు ఒక సంచిలో వేసుకుని కల్లూరులోని నవాబుపేట అల్లాబకాష్ దగ్గరికి వచ్చారు. సోమవారం వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నాల్గవ పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో మారువేషంలో కల్లూరులోని నిర్మల్ నగర్ లక్ష్మీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద కాపు కాసి ఏడుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 18వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావుతో కలసి విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు.

మరిన్ని వార్తలు