మాట ఇస్తే తప్పరు అని రుజువైంది: అగ్రిగోల్డ్‌ బాధితులు

29 Oct, 2019 13:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు జరిగిన అన్యాయంపై చర్చించారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధితులకు రూ. 1150 కోట్ల కేటాయించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని చూశారని.. తమని ఆదుకోవాలంటూ ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదని బాధితులు పేర్కొన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు చంద్రబాబు నిర్వాకం వల్లే చనిపోయారని, తమ బాధలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాదయాత్రలో విన్నవించుకున్నామని బాధితులు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భాదితులను ఆదుకుంటామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్‌లో బాధితులను ఆదుకుంటూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, అందుకోసం అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ మాట ఇస్తే తప్పరనే విషయాన్ని మరోసారి నిరూపితమైందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, రాష్ట్ర అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని,  బాధితులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు