తిండి పెట్టండి లేదా పని కల్పించండి

24 Jun, 2015 23:36 IST|Sakshi

తుళ్ళూరు(గుంటూరు జిల్లా): తిండి పెట్టండి లేదంటే పనులైనా కల్పించండి’ అంటూ వ్యవసాయ కూలీలు బుధవారం అన్నం గిన్నెలు పట్టుకొని గుంటూరు జిల్లా తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలు, అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారులు, చేతివృత్తిదారులు ప్రదర్శనగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లారు. తమ డిమాండ్లపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూలీలను కార్యాలయం నుంచి బయటకు రప్పించినప్పటికి అక్కడి నుంచి కదలలేదు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ కౌలు పరిహారం చెక్కులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నెలకు రూ.2,500 పింఛనుతో కుటుంబాలు గడవడం సాధ్యపడదని, రూ.9,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాజధాని కమిటీ కన్వీనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం మరోసారి సర్వే జరిపేందుకు సిద్ధమైందన్నారు. వ్యవసాయకార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుంటే మంత్రుల్ని గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. అనంతరం కాంపిటెంట్ ఆఫ్ అథారిటీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ రహంతుల్లాకు వినతి పత్రం అందచేశారు.

>
మరిన్ని వార్తలు