పంచుకోలేనివి..! దాచుకోలేనివి..! | Sakshi
Sakshi News home page

పంచుకోలేనివి..! దాచుకోలేనివి..!

Published Wed, Jun 24 2015 11:37 PM

పంచుకోలేనివి..! దాచుకోలేనివి..!

మహిళల లైంగిక సమస్యలు... సమాధానాలు
లైంగిక సమస్యలు చర్చించాలంటే ఈ సమాజంలో మగాడికే ఎంతో కష్టం. అలాంటిది మహిళలకు  ఇంకా కష్టం. ఇప్పుడిప్పుడే వారు తమ  సమస్యలను బెరుకుగానే అయినా గైనకాలజిస్ట్‌ల వద్ద ప్రస్తావిస్తున్నారు. సమాధానాలు పొందుతున్నారు. కాని  పట్టణాల్లో, పల్లెల్లో మహిళలు ఇలాంటి చొరవ ఇంకా చేయలేకపోతున్నారు.  అందుకే వారు చెప్పుకోలేని అనేక సమస్యలకూ  సందేహాలకూ నిపుణులైన మహిళా గైనకాలజిస్ట్ సమాధానమిస్తున్నారు. చదవండి. నిశ్చింతనూ మనశ్శాంతినీ పొందండి.
 
నా వయసు 22. ఎత్తు ఐదున్నర అడుగులు. బరువు 40 కిలోలు. నా వక్షోజాలు చాలా చిన్నవి. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసినవారంతా నేను చాలా సన్నగా ఉన్నానంటూ వెళ్లిపోతున్నారు. నేను తగినంత లావు పెరగడంతో పాటు నా వక్షోజాలు పెద్దగా పెరగాలంటే ఏ మందులు వాడాలో చెప్పండి.  రెగ్యులర్‌గా బ్రా వేసుకుంటే అవి పెరుగుతాయని ఒకరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మంచి సూచనలు ఇవ్వండి.
 - ఒక సోదరి, గూడూరు
 
మీ ఎత్తుకు మీరు కనీసం 50 కేజీల బరువుండాలి. అందుకు మందుల కంటే కూడా పౌష్టికాహారం తీసుకోవడం అవసరం. వక్షోజాల్లో కొవ్వు, పాలగ్రంథులు, కనెక్టివ్ టిష్యూ ఉంటాయి. మీరు సన్నగా ఉన్నారు కాబట్టి మీ కొవ్వుల పాళ్లు తక్కువగా ఉంటుంది. దాంతో సైజ్ కూడా తక్కువగానే ఉంటుంది. మీరు తగినంత బరువు పెరగడంతో పాటు మీ ఎద సైజ్ కూడా పెరగాలంటే కొవ్వులు తగిన మోతాదులో ఉండేలా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇందుకోసం మీరు పాలు, పెరుగు, పప్పులతో పాటు మాంసాహారం తినేవారైతే వారంలో ఎక్కువ సార్లు మాంసాహారం తీసుకోండి.

ఏ సీజన్‌లో లభించే తాజా పండ్లు ఆ సీజన్‌లో తీసుకుంటూ ఉండండి. సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తినండి. దాంతో మీ బరువు ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు పైఎద పరిమాణం కూడా పెరుగుతుంది. ఇక క్రమబద్ధమైన రీతిలో మసాజ్ చేయడం వల్ల కూడా రక్తప్రసరణ మరింత పెరిగి పరిమాణం పెరుగుతుంది. ఈ మసాజ్ చేసే విధానాన్ని మీ గైనకాలజిస్ట్‌ను అడిగి తెలుసుకోండి. సైజు పెంచడానికి తోడ్పడతాయంటూ  మార్కెట్‌లో దొరికే క్రీములు, నూనెలు, జెల్స్ వీటివల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. వాటివల్ల ఒక్కోసారి అలర్జీలు, దురదల వంటి దుష్ర్పభావాలూ రావచ్చు. కాబట్టి టీవీల్లోనూ, ఇతరత్రా ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దు.

ఇక మీరు శస్త్రచికిత్స వంటి ప్రక్రియల ద్వారా సైజు పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్రక్రియలో సిలికాన్ ఇంప్లాంట్స్ అమర్చి ప్లాస్టిక్ సర్జన్లు మీ ఎద పరిమాణాన్ని పెంచుతారు. బ్రా వేసుకోవడం వల్ల  సైజ్ పెరగదు. కాకపోతే బ్రా ఎత్తిపట్టుకుంటుంది. కాబట్టి చూడటానికి మంచి షేప్‌లో కనిపిస్తుంటాయి. ప్రధానంగా ఇందుకోసం మార్కెట్‌లో ప్యాడెడ్ బ్రాలతో మీ ఛాతీ పెద్దగా కనిపిస్తుంది. మీరు ఈ విషయమై ఎక్కువ ఆందోళన పడవద్దు. బ్రెస్ట్ మసాజ్, బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేయాలో మీ గైనకాలజిస్ట్‌ను అడిగి తెలుసుకొని, వాటిని చేస్తూ, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే రొమ్ములు పెద్దవిగానూ కనిపిస్తాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి.
 
నా వయసు 24. పెళ్లయి నాలుగేళ్లు అయ్యింది. ఇప్పుడు నేను రెండో నెల గర్భవతిని. ఈ సమయంలో నేను, మావారితో కలవవచ్చా? ఒకవేళ కలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఈ టైమ్‌లో కలయిక వద్దంటున్నారు. అదేమాట మావారితో చెబితే చూషణ (ఓరల్ సెక్స్) చేయమని అడుగుతున్నారు. దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? చెప్పండి.
 - ఓ సోదరి, చెన్నై

 
మీ ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంది, కడుపులోని బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, గర్భాశయ ముఖద్వారం ఎంత పొడవుంది, మాయ ఏమైనా కిందికి జారి ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా లాంటి అనేక అంశాల మీద మీరు సెక్స్‌లో పాల్గొనవచ్చా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని పరీక్షిస్తున్న డాక్టర్‌ను సంప్రదిస్తే పై విషయాలను పరీశీలించి మీకు తగిన సలహా ఇస్తారు. మీకు ఎలాంటి సమస్యా లేకపోతే మీ పొట్ట మీద బరువు పడకుండా ఎనిమిదో నెల వరకూ సెక్స్‌లో పాల్గొనవచ్చు. అయితే గర్భంతో ఉన్నప్పుడు మొదటి మూడు నెలలూ, చివర్లో తొమ్మిదో నెలలో సెక్స్‌లో పాల్గొనకపోవడమే మంచిది. ఇక ఓరల్ సెక్స్ అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ దంపతులిద్దరి ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. అయితే మీవారి జననేంద్రియాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మీకు నోటి ద్వారా పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు పాటించడం అవసరం.
 
నా వయసు 24. నేనొక వ్యక్తిని ప్రేమించాను. అతడి ఒత్తిడిపై రెండుమూడు సార్లు  సెక్స్‌లో పాల్గొన్నాను. అతడితో కలిశాక నా యోనిద్వారం దగ్గర కురుపులా అయ్యింది. అయితే కొద్దిరోజుల్లోనే తగ్గింది. కానీ మళ్లీ కురుపు తిరగబెట్టింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - ఒక సోదరి, నిడదవోలు

 
పెళ్లికి ముందు ఇలా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం శారీరకంగానే గాక, సామాజికంగానూ అనేక సమస్యలకు కారణమవుతుంది. మీరు ఇలా కలవడం వల్ల  గర్భం రావచ్చు. అతడికి సుఖవ్యాధులుంటే మీకూ సంక్రమించవచ్చు. అలాగే ఆ ప్రాంతంలో వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించకపోతే జనేంద్రియాల ప్రాంతంలో చెమటలు పట్టి కురుపులు రావచ్చు. మీకు వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటే యోనిద్వారం వద్ద ఇన్ఫెక్షన్ వచ్చి, మాటిమాటికీ కురుపులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మీకు స్థిమితం లేకుండా చేస్తాయి. మీరు బిడియపడకుండా ఒకసారి మీకు దగ్గర్లోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు సహాయపడటం కోసమే వైద్యులుంటారు. అవసరాన్ని బట్టి మంచీ, చెడు హితబోధ చేసి, మీకు అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స చేస్తారు.
 
నా వయసు 28. ఇటీవలే వివాహం అయ్యింది. మొదటిరాత్రి భర్తతో కలిసినప్పుడు నాకు రక్తస్రావం కాలేదు. అంటే కన్నెపొర చిరగలేదేమోనని నా అభిప్రాయం. అయితే విచిత్రంగా రెండు నెలల తర్వాత గర్భం వచ్చింది. కన్నెపొర చిరగకుండా గర్భం ఎలా వస్తుంది. నా సందేహానికి సమాధానం వివరంగా చెప్పండి.
- ఒక సోదరి, నిజామాబాద్

 
మొదటిరాత్రి భర్తతో కలిసినప్పుడు తప్పనిసరిగా రక్తస్రావం అయి తీరాలని నియమమేదీ లేదు. ఈ అంశంపై చాలామంది పురుషుల్లో అపోహలు ఉండి, వారి జీవిత భాగస్వాములను వేధిస్తుంటారు. నిజానికి మీకంటే పురుషులు అవగాహన చేసుకోవల్సిన అంశమిది. యోని లోపలివైపున ఉండే సన్నటి చర్మపు పొరను కన్నెపొర (హైమన్) అంటారు. కొందరిలో ఇది యోనికి సగం వరకే ఉంటుంది. మరికొందరిలో జల్లెడలా ఉంటుంది. చాలా అరుదుగా కొందరిలో మందంగా ఉండి, యోనిరంధ్రం మొత్తాన్ని మూసేస్తుంది.

ఇక కన్నెపొర పలచగా ఉండే చాలామంది యువతుల్లో ఇది ఆటలాడే సమయాల్లో, సైకిల్ తొక్కేటప్పుడు, బరువు పనులు చేసేటప్పుడు దానికదే చిరిగిపోతుంది. ఇక కన్నెపొర బాగా మందంగా ఉండి, యోనిరంధ్రాన్ని కప్పేసిన కొందరిలోనే మొదటికలయిక సమయంలో రక్తం వస్తుంది. అంతేగానీ ప్రతి కన్యకూ రక్తస్రావం జరగదు. రక్తస్రావం జరగనంత మాత్రాన ఆమె కన్నె కాదని చెప్పేందుకు వీల్లేదు. కాబట్టి మీరు ఆటలాడే సమయంలోనో లేదా సైకిల్ నడిపే సమయంలోనో లేదా మరేదో సమయంలో పల్చగా ఉన్న మీ కన్నెపొర చిరిగి ఉంటుంది. ఇక మీ భర్తతో కలయిక వల్ల మీకు గర్భం వచ్చింది. మీ సందేహాలను పక్కనపెట్టి తొలిచూలులో ఉండే మంచి అనుభవాలను, ఆనందాలను చవిచూడండి. మీ డాక్టర్ దగ్గరికి రెగ్యులర్‌గా చెకప్‌లకు వెళ్తూ ఉండండి.
 
నా వయసు 25. పెళ్లయి పది నెలలవుతోంది. ఈమధ్య భర్తతో శారీరకంగా కలిసే సమయంలో వాసన వస్తోంది. యోని పొడిబారిపోయి ఉంటోంది. కలయిక తర్వాత యోనిని శుభ్రపరుచుకోకపోతే వాసన ఎక్కువవుతోంది. ఒక్కోసారి సెక్స్‌లో పాల్గొనని సమయంలోనూ, మూత్రవిసర్జన సమయంలో ఇలా వాసన వస్తోంది. ఇక కలయిక తర్వాత మావారి పురుషాంగంపైన తెల్లటి కురుపుల్లాంటివి వస్తున్నాయి. అవి మళ్లీ వాటంతట అవే తగ్గుతున్నాయి. మా దంపతుల సమస్యకు పరిష్కారం చెప్పండి.
 -ఒక సోదరి, హైదరాబాద్

 
శారీరకంగా కలయిక తర్వాత కొన్నిసార్లు వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా వంటి క్రిములు భార్యాభర్తల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరూ నిత్యం జననేంద్రియాలను, వాటి పరిసరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించాలి. మీరు రాసిన వివరాల ప్రకారం మీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇద్దరూ కలిసి ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించండి.

డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి, అది ఏ తరహాకు చెందిన ఇన్ఫెక్షన్ అనేది నిర్ధారణ చేస్తారు. దాన్ని బట్టి మీ ఇన్ఫెక్షన్‌ను తగ్గించే యాంటీబయాటిక్స్ ఇస్తారు. వాటిని వాడే సమయంలో తాత్కాలికంగా మీరిద్దరూ శారీరకంగా కలవకపోవడం మంచిది. అలాగే జననేంద్రియాల వద్ద వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించండి. రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండండి.
 
నా వయసు 28. ఇటీవలే పెళ్లయ్యింది. కానీ సెక్స్ విషయంలో  ఎంజాయ్ చేయలేకపోతున్నాము. నాకు సెక్స్ కోరికలు ఉన్నాయి. అయితే నా భర్త ఎంతగా ప్రయత్నించినా ప్రవేశం జరగడం లేదు. పైగా బలవంతంగా ప్రయత్నిస్తే నాకు తీవ్రమైన నొప్పి వస్తోంది. అతడికి కూడా నొప్పిగా ఉంటోందట. పైగా పత్రికల్లో చదివినట్లుగా నా యోని నుంచి ఎలాంటి స్రావాలూ వెలువడటం లేదు. నాకు తగిన పరిష్కారం చూపండి.
 - ఒక సోదరి, విశాఖపట్నం

 
అంగప్రవేశం జరగకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ వల్ల నొప్పి వస్తుందనే ఆందోళన వల్ల కలయిక సమయంలో మీ యోని కండరాలు బిగుసుకుపోవచ్చు. అలాంటప్పుడు యోని నుంచి స్రావాలు కూడా వెలువడవు. కొంతమందిలో యోనిరంధ్రం చాలా చిన్నదిగా ఉండవచ్చు. లేదా మీ కన్నెపొర చాలా మందంగా ఉండవచ్చు. కాబట్టి మీ ఇద్దరిలో ఏదైనా తెలియని భయం, ఆందోళన ఉంటే టెన్షన్ వదిలి, బిడియపడకుండా ఇద్దరూ సహకరించుకోండి.

దాంతో మీ సమస్య తీరవచ్చు. ఒకవేళ ఇలా ప్రయత్నించాక కూడా ప్రయోజనం కనిపించకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. అప్పుడు గైనకాలజిస్ట్ మిమ్మల్ని పరీక్షించి మీ యోనిరంధ్రం నిజంగానే బిగుతుగా ఉందా, లేక కేవలం మీ ఆందోళన కారణంగా ఇలా జరుగుతోందా అన్నది నిర్ధారణ చేస్తారు. భయం వల్లనే ఇలా జరుగుతుంటే మీకు లూబ్రికేటింగ్ వెజైనల్ జెల్స్ ఇస్తారు. అప్పుడు కూడా ఫలితం లేకపోతే పెరినియోటమీ లేదా హైమోనాటమీ అనే చిన్న ప్రక్రియతో యోని రంధ్రాన్ని సరిచేస్తారు. ఆ తర్వాత మీ దాంపత్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.
 
- డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్,  మోతీనగర్, హైదరాబాద్

Advertisement
Advertisement