ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరిట దగా

12 Nov, 2014 09:44 IST|Sakshi
  • మోసపోతున్న నిరుద్యోగ యువకులు
  •  టాస్క్ ఫోర్సుకు ఫిర్యాదు చేసినా  స్పందన లేదని బాధితుల ఆవేదన
  • గోపాలపట్నం : విమానాశ్రయంలో డెరైక్టు ఉద్యోగం.. ట్రైనింగులో జీతం రూ.12 వేలు.. భోజనం, వసతి ఉచితం.. ఇదేదో బాగుందని వెంపర్లాడితే పప్పులో కాలేసినట్టే. ఇదీ  ఉద్యోగాల పేరిట జరుగుతున్న ఘరానా మోసం.  విమానాశ్రయంలో కార్గో సూపర్‌వైజర్లు, రేంప్ సూపర్ వైజర్లు, రన్‌వే సూపర్‌వైజర్లు, హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్లు, గ్రౌండ్ వర్కర్లు, ఫ్లైట్ క్లీనర్ల ఉద్యోగాలున్నాయని శ్రీరాం గ్రూప్స్, మల్లికార్జున ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీల పేరిట ప్రచారాలు సాగిస్తున్నారు.

    దీనికి విద్యార్హత టెన్త్ చాలని చెబుతుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. నిర్వాహకులు సూచించిన ప్రకారం రూ. 1000 నుంచి రూ. 1500 బ్యాంకు అకౌంట్లో వేస్తున్నారు. ఆ ప్రకారం బాధితులకు ఫోన్ వస్తుంది. మెయిల్ అడ్రసు ఉంటే కాల్ లెటర్ మెయిల్ చేస్తున్నారు. ఈ సదుపాయం లేని వారికి ఏకంగా ఇళ్ల అడ్రసుకే పోస్టు ద్వారా ఇంటర్వ్యూ లెటర్లు పంపుతున్నారు.

    తాము సూచించిన పోస్టుల్లో ఫలానా తేదీలోగా నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చని చెబుతున్నారు. నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల జీతం శిక్షణ సమయంలో ఉంటుందని పేర్కొంటున్నారు. పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ వైద్యునితో ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఆరు ఫొటోలు, పదవతరగతి ,ఐడీ ప్రూఫ్ పత్రాలు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, లేదా రేషన్‌కార్డుతో ఇంటర్వ్యూకురావాలని   లెటరులో పేర్కొంటున్నారు. ఈ లెటర్లు చూసి ఉబ్బితబ్బిబ్బయిన  అభ్యర్థులు విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.  
     
    కాల్ లెటర్లు విమానాశ్రయ అధికారులకు చూపించే సరికి వారు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో ఇంటర్వ్యూలు లేవని చెప్పడంతో అభ్యర్థులు షాక్‌కు గురవుతున్నారు.   ఇలా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు కర్నూలు, గుంటూరు, ఒంగోలు తదితర జిల్లాలకు చెందిన ఎంతోమంది నిరుద్యోగులు మోసపోయారు.
     
    లక్షల్లో అక్రమార్జన

    విమానాశ్రయంలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసగాళ్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఉద్యోగాల పేరిట నిత్యం అన్ని జిల్లాల్లో ప్రచారాలు సాగించడం వల్ల పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు ఆశ్రయిస్తున్నారు. తీరా మోసపోయాక పోలీసుల చుట్టూ ప్రదక్షణిలు చేయలేక మిన్నకుండి పోతున్నారు. తాము మోసపోయింది వెయ్యి నుంచి 15 వందలే కదా అనుకుంటున్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులనుంచి సొమ్ము వసూలు చేయడంవల్ల లక్షల్లోనే సంపాదించుకుంటున్నారు. అభ్యర్థులు సొమ్ము అకౌంట్లో వేశాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఈ ఘరానా మోసాలపై టాస్క్‌ఫోర్సుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న విమర్శలున్నాయి.  
     
    ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
    డిప్లమో చదివినా ఉద్యోగ అవకాశాలకు నోచుకోలేదు. విమానాశ్రయంలో సూపర్‌వైజరు పోస్టు ఉందంటే శ్రీరాం గ్రూప్‌కు రూ.1000, మల్లికార్జున ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.1500 అకౌంట్లో వేశాను. నిర్వాహకులు నాకు మెయిల్ ద్వారా కాల్ లెటరు పంపారు. తీరా విమానాశ్రయానికి వెళ్తే బోగస్ అని తేలింది. నగరంలో టాస్క్‌ఫోర్సు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.         
    -  ఫణికుమార్, బాధితుడు, ఎంవీపీకాలనీ, విశాఖపట్నం
     
    మోసపోయాను
    విమానాశ్రయంలో ఉద్యోగం వస్తుందని నమ్మి నేనూ మోసపోయాను. పోయింది రూ.వెయ్యే కదా అని ఊరుకున్నాను. నాలా ఎందరో నిరుద్యోగులు మోసపోతున్నారు. నగరం వరకూ ఎలాగున్నా ఇతర జిల్లాల నిరుద్యోగులు ఆర్థిక ప్రయాసలకు లోనై ఆవేదన చెందుతున్నారు.
     - శ్రీనివాస్, ఆర్‌ఆర్‌వీపురం, విశాఖపట్నం
     
    ఉద్యోగాల ఉచ్చులో పడకండి
    నిరుద్యోగులు విమానాశ్రయంలో ఉద్యోగాల ఉచ్చులోపడి మోసపోవద్దు. ఈ మోసాల సంగతి మా దృష్టికీ వచ్చింది. విమానాశ్రయంలో ఉద్యోగాలు ఉంటే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌పేపరు ద్వారా తెలుసుకోవాలి. అదీ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెలువరిస్తేనే నమ్మాలి. ఇక విమాన సంస్థల్లో ఉద్యోగాలైతే ఆయా సంస్థలు నేరుగా ప్రకటిస్తాయి.
    -  పట్టాభి, విశాఖ విమానాశ్రయ డెరైక్టర్
     

మరిన్ని వార్తలు