అక్కమ్మ కథ... తీరని వ్యథ

23 Mar, 2018 07:03 IST|Sakshi
ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న అక్కమ్మ

అర్ధంతరంగా వదిలేసిన భర్త

ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కాలిపోయిన పేగులు

ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఆపరేషన్‌కు వైద్యుల నిరాకరణ

నిస్సహాయస్థితిలో సహాయం కోసం ఎదురుచూపు

జీవితాంతం అండగా ఉంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త అర్ధంతరంగా వదిలేశాడు. కడుపున పుట్టిన బిడ్డకు పట్టెడు అన్నం పెట్టేందుకు కాయకష్టం చేసిన కాలం వెక్కిరించింది. ఆదుకుంటారని పుట్టింటికి వెళితే... వారికే మెతుకులేక ఎండిన డొక్కలు ఎదురొచ్చాయి. నా అనే దిక్కులేక ఆ మహిళ చలించిపోయింది. తాను భూమికి భారమేనని భావించి యాసిడ్‌ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పేగులు కాలిపోయాయి. ఆపరేషన్‌ చేయించుకొనేందుకు డబ్బులు లేక... అమ్మ నువ్వెందుకు ఇలా చేశావని కూతురు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఆ తల్లి ఆసుపత్రి మంచంపైన మగ్గిపోతోంది.

నరసరావుపేట టౌన్‌:  మండలంలోని కేతముక్కల అగ్రహారం దళితవాడకు చెందిన కలిసేటి అక్కమ్మకు సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన భూపతితో సుమారు 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఐదేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఏడేళ్ల తన కుమార్తె ప్రవళ్లికతో తల్లిదండ్రులు శేఖర్, ద్వారకల వద్ద అగ్రహారంలో ఉంటోంది. తండ్రి శేఖర్‌కు మెదడులో గడ్డ రావడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడు. వారి జీవనోపాధి కష్టతరంగా మారింది. ఈ క్రమంలో  భర్త నిరాదరణకు తోడు తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో ఎనిమిది నెలల కిందట మరుగుదొడ్లు శుభ్రం చేసే యాసిడ్‌ను తాగి అక్కమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను వైద్యశాలలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు పేగులు కాలిపోయాయని నిర్ధారించారు. ఆపరేషన్‌ చేయాలని, అందుకు గానూ నాలుగులక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థిక స్థోమత లేదని చెప్పడంతో తాత్కాలికంగా పొట్ట పక్క భాగంలో రంధ్రం చేసి ఆహారాన్ని ఇస్తున్నారు.

సీఎం సాయం కోసం ఎదురుచూపులు
అక్కమ్మకున్న తెల్లరేషన్‌ కార్డుపై అపరేషన్‌ చేయాలని పలు వైద్యశాలలకు తిరిగినా ప్రయోజనం దక్కలేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేనిదే ఆపరేషన్‌ చేయమని వైద్యులు చెప్పడంతో కార్డుకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో సీఎమ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం ధరఖాస్తు చేసుకొని నెలల నుంచి ఎదురు చూçస్తోంది.

క్షీణిస్తున్న ఆరోగ్యం
పేగులు కాలిపోవడంతో అక్కమ్మ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి పోతోంది. నాలుగురోజుల కిందట పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఏరియా వైద్యశాలలో చేర్పించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక పక్క మంచంపై ఉన్న రోగులు, వారికోసం వచ్చే సహాయకులను ప్రాథేయపడుతోంది.దాతల సహా యం చేస్తే తప్పా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు