మద్యం టెండర్లకు నేటితో గడువు పూర్తి

27 Jun, 2015 01:58 IST|Sakshi
మద్యం టెండర్లకు నేటితో గడువు పూర్తి

- 302 షాపులకు టెండర్ల ఆహ్వానం
- వ్యాపారుల నుంచి తగ్గిన స్పందన
- నిబంధనల నేపథ్యంలోనే వెనుకంజ
మచిలీపట్నం :
జిల్లాలో మద్యం టెండర్ల స్వీకరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ నెల 25 నుంచి మద్యం షాపుల టెండర్లను ఎక్సైజ్ అధికారులు కలెక్టరేట్‌లో స్వీకరిస్తున్నారు. జిల్లాలో 335 వైన్ షాపులు ఉండగా ఈ సారి వాటిలో 33 షాపులను ప్రభుత్వమే నిర్వహించనుంది. మిగిలిన 302 షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 17, విజయవాడ ఈఎస్ పరిధిలో 16 షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది.

మిగిలిన షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇందుకుగాను కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్లను ఆయా ఎక్సైజ్ సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేశారు. ఈ నెల 25న 10 టెండర్లు దాఖలు కాగా శుక్రవారం జోరు పెరిగింది. దాదాపు 730 టెండర్లు రెండోరోజై దాఖలైనట్లు అధికారులు తెలిపారు.  అయితే గతేడాదితో పోల్చితే ఇది తక్కువేనని అధికారులు చెబుతున్నారు. గతేడాది మొత్తం 3,600 టెండర్లు రాగా, ఈసారి ఆ స్థాయిలో రాకపోవచ్చని అంటున్నారు. టెండర్ల స్వీకరణ గడువు శనివారంతో ముగియనుంది. ఆఖరు రోజు కావటంతో అధిక సంఖ్యలో టెండర్లు వస్తాయని ఎక్సైజ్ అధికారులు ఆశిస్తున్నారు. ఈ నెల 29న టెండరు బాక్సులు తెరిచి లాటరీ పద్ధతిలో మద్యం షాపులను కేటాయించనున్నారు.
 
ని‘బంధనాలు’...

ఈసారి మద్యం షాపులను రెండేళ్ల గడువుతో ఇవ్వనున్నారు. 2015 జూలై ఒకటి నుంచి 2017 జూన్ 30 వరకు మద్యం షాపులు నడుపుకొనేందుకు లెసైన్సు జారీ చేయనున్నారు. లెసైన్సులు దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం ధరలను పెంచి విక్రయాలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలను నిర్వహించనుండటంతో ఆ అవకాశం తక్కువగా ఉంటుందని వ్యాపారుల భావిస్తున్నారు. లెసైన్సు ఫీజును జనాభా ప్రాతిపదికన రూ.30 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు నిర్ణయించారు.

గతేడాది జిల్లా వ్యాప్తంగా 28 షాపులకు అసలు టెండర్లు దాఖలు కాలేదు. ఈ ఏడాది మార్చిన నిబంధనల ఆధారంగా వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది టెండరు దరఖాస్తు ఫీజు రూ.25 వేలు కాగా ఈ ఏడాది జనాభా ప్రాతిపదికన రూ.30 వేలు, రూ.40 వేలు, రూ.50 వేల వరకు పెంచారు. ఈ నగదు తిరిగి ఇచ్చే అవకాశం లేకపోవటంతో లాటరీలో మద్యం షాపు రాకుంటే ఈ సొమ్మును కోల్పోతామని వ్యాపారులు వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. దీంతో పాటు టెండరు దాఖలు చేసేవారు రెండేళ్ల ఐటీ రిటర్న్స్‌ను సమర్పించాలనే నిబంధన విధించారు. గతంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు సైతం టెండరు దాఖలు చేసేందుకు అవకాశం ఉండేది.

ఈసారి ఆ పరిస్థితి లేకపోవటంతో తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలవుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు షాపింగ్ మాల్స్‌లో మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్ల రూపంలో మద్యాన్ని అందుబాటులో ఉంచటం, సహకార సంఘాల ద్వారా మద్యం విక్రయాలు జరుపనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో షాపులను దక్కించుకుంటే ఎంతమేర లాభపడతామనే ఆలోచనలో వ్యాపారులు ఉన్నారు. గత రెండు రోజులుగా కలెక్టరేట్‌లో మద్యం షాపులకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుండగా ఇప్పటివరకు మద్యం వ్యాపారం చేసిన వారే టెండరు దాఖలు చేసేందుకు ముందుకు వచ్చారు. గడువు పూర్తయ్యే సమయానికి ఎన్ని టెండర్లు దాఖలవుతాయో వేచిచూడాలి.
 
ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇక్కడే
జిల్లాలో 33 షాపులను ప్రభుత్వమే నడపనుంది. గెజిట్ నంబర్ల వారీగా వాటి వివరాలివీ... మచిలీపట్నం 6, పెడన 11, బంటుమిల్లి 21, మోపిదేవి 37, మొవ్వ 49, గుడివాడ 58, పామర్రు 67, దోసపాడు 78, కైకలూరు 87, కలిదిండి 90, ముదినేపల్లి 96, నందివాడ 112, గన్నవరం 127, బాపులపాడు 132, తరిగొప్పుల 138, ఉయ్యూరు 154, పమిడిముక్కల 169, యనమలకుదురు 206, ఈడుపుగల్లు 217, ఇబ్రహీంపట్నం 242, మైలవరం 246, జి.కొండూరు 250, నందిగామ 264, పెనుగంచిప్రోలు 271, కంచికచర్ల 283, చిల్లకల్లు 297, నూజివీడు 307, తిరువూరు 319, విస్సన్నపేట 329, విజయవాడలో 183, 192, 198, 225 గెజిట్ నంబర్లతో ప్రభుత్వం ద్వారా నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు