గోదావరి పుష్కరాలపై వివాదం | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలపై వివాదం

Published Sat, Jun 27 2015 1:53 AM

ప్రముఖ జ్యోతిష్కుడు, మహా మహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తి శాస్త్రి

28నుంచే ప్రారంభం అంటున్న ప్రముఖ జ్యోతిష్కుడు కృష్ణమూర్తి శాస్త్రి
రాజమండ్రి కల్చరల్: గోదావరి పుష్కరాల ప్రారంభం జూలై 14వ తేదీనుంచి కాదని, ఈ నెల 28వతేదీ ఉదయం 8.27 గంటలకే పుష్కరాలు ప్రారంభం కానున్నాయని ప్రముఖ జ్యోతిష్కుడు, మహా మహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తి శాస్త్రి అంటున్నారు.  28వ తేదీ నుంచి జూలై 9 మధ్యలో ఎప్పుడు తీర్థవిధులు నిర్వహించినా   పుష్కరుని అనుగ్రహం దక్కుతుందని ఆయన అంటున్నారు.   శుక్రవారం రాజమండ్రిలోని తన నివాసగృహంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

‘వరాహమిహిరుడు క్రీ.పూ. 450-550 మధ్య కాలంలో జీవించారు. ఈ విషయాలలో ఆయన తొలి సైద్ధాంతిక ప్రామాణిక కర్త. పుష్కర తేదీల విషయంలో, వారి గణనానికి మా పంచాంగ గణనం అత్యంత చేరువలో ఉంది. అయితే, దురదృష్టవశాత్తు..1954-55 మధ్యకాలంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచాంగాలలో ఏకీకరణను సాధించడానికి కేలండర్ రిఫార్మ్స్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి ఎన్.సి.లహరి కార్యదర్శి.
 
ఆయన ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు పంచాంగ కర్తలు తమ తమ వాదనలు వినిపించారు. ఏకీకరణకు ప్రయత్నించడానికి బదులు, లహరి ‘ఇప్పుడు మార్పులు, చేర్పులు కుదరవు. సర్దుకు  పోవాలి’ అని చెప్పారు. దీనిని ఆధారం చేసుకునే ఆధునిక పంచాంగకర్తలు లెక్కలు కడుతున్నారు. లహరికి ఈ విషయంలో గతంలో మేం ఎన్ని లేఖలు రాసినా జవాబు రాయలేదు. సనాతన ధర్మంలో, ముహూర్త విషయాలలో సర్దుకుపోవడం అన్న ధోరణికి తావు లేదు. విజ్ఞులు ఈ విషయాలను గమనించాలి’ అని మధుర కృష్ణమూర్తి శాస్త్రి అన్నారు.

Advertisement
Advertisement