హరిత రాజధానిగా అమరావతి..

26 May, 2015 03:47 IST|Sakshi
హరిత రాజధానిగా అమరావతి..

* సీఆర్‌డీఏ పరిధి ఎనిమిది ప్రణాళిక ప్రాంతాలుగా విభజన
* 7,420 చ.దరపు కిలోమీటర్లలో రాజధాని ప్రాంతం
* 854 చదరపు కిలోమీటర్ల కేంద్ర ప్రణాళిక ప్రాంతంలో రాజధాని
* 217 చదరపు కిలోమీటర్లలో రాజధాని నగరం
* కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో వాస్తుకు పెద్దపీట
* జూలై మధ్యలో సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్
* అందులో రాజధానిలోని కీలక నిర్మాణాల వివరాలు

 
 సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. ఆ రోడ్ల వెంటే హరిత వనాలు.. అంతర్గత జలమార్గాలు.. సైకిల్‌పై వెళ్లడానికి, నడిచి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు.. జనావాసాలకు అతి సమీపంలోనే వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు.. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్.. నీటి సరఫరా.. మచిలీపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల సమీపంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేలా రాజధాని ప్రాంత ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం రూపొంచింది. ఇప్పటికే రాజధాని మొత్తంగా ఒక మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు అందించిన విషయం విదితమే. సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్ తాజాగా సోమవారం రాజధాని ప్రాంత ప్రణాళిక, రాజధాని నగర మాస్టర్ ప్లాన్‌ను హైదరాబాద్‌లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందించారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ సంస్థ సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది.
 
 అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్‌లో పెద్దపీట వేసింది. ఈ ప్లాన్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని ప్రాంతాన్ని ఎనిమిది ప్రణాళిక ప్రాంతాలుగా విభజించింది. ఇందులో రాజధాని నగరం కలిసి ఉండే ప్రాంతాన్ని కేంద్ర ప్రణాళిక ప్రాంతంగా ప్రతిపాదించింది. కేంద్ర ప్రణాళిక ప్రాంతం 854 చదరపు కిలోమీటర్లలో అంటే.. 2,11,028 ఎకరాల్లో విస్తరించి ఉండాలని సూచించింది. ఇందులో రాజధాని నగరం 217 చదరపు కిలోమీటర్లలో అంటే 53,621 ఎకరాల్లో నిర్మించాలని పేర్కొంది. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ వివరాలను సుర్బానా ఇంటర్నేషనల్ కన్సెల్టెన్సీ సీఈవో పాంగ్ యీ యాన్ విలేకరుల సమావేశంలో ప్రదర్శించి చూపారు. రాజధానికి సంబంధించి కీలకమైన నిర్మాణాలు ఉంటే సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను జూలై మధ్యలో అందజేస్తామని ఈ సందర్భంగా ఈశ్వరన్ ప్రకటించారు.
 
 
 వాస్తుకు పెద్దపీట
 కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో వాస్తుకు పెద్దపీట వేశారు. రాజధాని నగరంలో కృష్ణా నదికి అభిముఖంగా.. ఈశాన్యం వైపున త్రిభుజకారంలో కొంత ప్రాంతాన్ని ఖాళీగా ఉంచాలని ప్రతిపాదించింది. దీన్నే ‘బ్రహ్మస్థానం’గా పేర్కొంది. వాస్తు ప్రకారం బ్రహ్మస్థానం ఏర్పాటు చేయడంవల్ల నగరం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేసింది.
 
 సు‘జలా’ం
 కొండవీటి వాగు, కృష్ణా నదులపై చిన్న చిన్న రిజర్వాయర్లను నిర్మించి.. నిత్యం ఐదు టీఎంసీల జలాలను నిల్వ ఉంచాలని సూచించింది. రాజధాని నగర తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఈ జలాలు సరిపోతాయని పేర్కొంది.
 
 ట్రా‘ఫికర్’కు చెక్
 రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకు ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్, వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే మార్గాలను ఎక్స్‌ప్రెస్ మార్గాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. రాజధాని చుట్టూ మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలను కలుపుతూ.. అలానే మధ్యలోనూ 155 కిలోమీటర్లమేర ప్రధాన రహదారులను నిర్మించాలని సూచించింది. ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ 332 కిలోమీటర్ల మేర ఉప ప్రధాన రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. రాజధాని నగరంలో 324 కిలోమీటర్ల పొడవును అంతర్గత రహదారులను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేసింది.
 
 నడక, సైకిల్ మార్గాలు
 నడక, సైకిల్ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే కాలుష్యానికి అడ్టుకట్ట వేయవచ్చునని సూచించింది. జనావాసాలకు సమీపంలోనే అంటే.. ప్రజలు నడిచి వెళ్లడానికిగానీ సైకిల్‌పై వెళ్లడానికిగానీ సౌకర్యంగా ఉండేలా విద్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు నిర్మించడంవల్ల కాలుష్యంతోపాటూ ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. ఆ మేరకు 150 కిలోమీటర్ల మేర సైకిల్ మార్గం, 170 కిలోమీటర్ల పొడవున నడక మార్గంను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది.
 
 మెట్రో రైలు వ్యవస్థ
 విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలను రాజధాని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు మార్గాన్ని 135 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మంగళగిరికి సమీపంలో ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది.
 
 జలమార్గం
 కొండవీటివాగు, కృష్ణా నదుల్లో నిత్యం నీళ్లు ఉండేలా రిజర్వాయర్లు నిర్మించి.. జల మార్గాలను అభివృద్ధి చేయవచ్చునని ప్రతిపాదించింది. సుమారు 80 కిలోమీటర్ల పొడవున అంతర్గత జలమార్గం ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటూ పర్యాటకులను ఆకట్టుకోవచ్చునని సూచించింది.
 
 అంతర్జాతీయ విమానాశ్రయం
 రాజధాని నగరంలో.. మంగళగిరికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది. ఇందుకు కనీసం ఐదు వేల ఎకరాల భూమిని కేటాయించాలని పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి, విజయవాడ, ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రతిపాదించింది.
 
హరితవనం:  అమరావతిని హరితవనంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించింది. రోడ్ల వెంట హరితవనాలు ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటు పర్యావరణ సమతౌల్యాన్ని సాధించవచ్చునని అభిప్రాయపడింది. ప్రధాన రహదారులు వెంట 200 కిలోమీటర్ల మేర హరితవనాలను ఏర్పాటుచేయాలని పేర్కొంది. హరితవనాలకు అనుసంధానంగా పౌర ఉద్యానవనం(సివిక్ పార్క్), కేంద్ర ఉద్యానవనం(సెంట్రల్ పార్క్), నిడుముక్కల ప్రాంతంలో కెనాల్ పార్క్, గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం(ఇంటర్నేషనల్ యూనివర్సిటీ) క్రికెట్ స్టేడియంను నిర్మించాలని సూచించింది.
 
 వెయ్యి హెక్టార్లలో ద్వీపాల అభివృద్ధి
 రాజధాని నగరానికి అభిముఖంగా అమరావతి నుంచి విజయవాడ వరకూ 35 కిమీల పొడవున కృష్ణా నది ప్రవహిస్తుంది. కృష్ణా నది జలవిస్తరణ ప్రాంతం మూడు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 2,800 హెక్టార్లలో ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో వెయ్యి హెక్టార్లలో విస్తరించిన ద్వీపాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ద్వీపాలను అభివృద్ధి చేసి రిసార్ట్స్ ఏర్పాటుచేయాలని సూచించింది.
 
 పారిశ్రామికం
 మచిలీపట్నం, నిజాంపట్నం (వాన్‌పిక్)లో నౌకాశ్రయాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఈ నౌకాశ్రయాలకు సమీపంలోనే పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. నౌకాశ్రయాలు, పారిశ్రామిక నగరాలను జాతీయ ప్రధాన రహదారులు, అమరావతిని అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారులు నిర్మించాలని సూచించింది.
 
 పర్యాటకం
 రాజధాని చుట్టూ చరిత్ర ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తే పర్యాటకులను భారీ ఎత్తున ఆకట్టుకోవచ్చునని ప్రతిపాదించింది. విజయవాడ కనకదుర్గ ఆలయం, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, మంగళగిరి ఆలయం, నీరుకొండ, అనంతవరం ఆలయాలు, అమరావతి బౌద్ధ ఆరామాలను అనుసంధానం చేస్తూ 145 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు, 45 కిలోమీటర్ల పొడవున జలమార్గాలు, 61 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది.
 
 మూడు దశల్లో మాస్టర్ ప్లాన్‌లు...
 ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సింగపూర్ సంస్థలు మూడు దశల్లో మాస్టర్ ప్లానులు రూపొందిస్తున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధి మొత్తంగా ఔటర్‌లైన్స్‌తో తొలివిడత మాస్టర్ ప్లాన్‌ను మార్చి 30 న సమర్పించింది.తాజాగా సీఆర్‌డీఏ పరిధి లోపల కొంత భాగాన్ని సెంట్రల్ ప్లానింగ్ ఏరియా (సీపీఏ) గా గుర్తిస్తూ రెండో దశ ప్రణాళికను సోమవారం అందజేసింది. రాజధానిలో అత్యంత కీలకమైన (రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు వచ్చే ప్రణాళిక) సీడ్ కేపిటల్ ఏరియా (ఎస్‌సీఏ) ను మూడో దశలో అందజేస్తుంది. దాన్ని వచ్చే జూన్ మధ్య కాలంలో అందిస్తామని ఈశ్వరన్ ప్రకటించారు. దానిని అందుకున్న తర్వాత రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తుంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థతో 2014 డిసెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఆ సంస్థ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన బాధ్యత ఆ దేశంలోని కార్పొరేట్ కంపెనీలు జురాంగ్, సుర్బానాలకు అప్పగించి తయారు చేయించింది.
 
 మూడు దశల ప్రాజెక్టుల పరిధి ఇలా...
 సీఆర్‌డీఏ (కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ): రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. దీని పరిధి 7,420 చ.కిమీల. అంటే.. 18,33,521 ఎకరాల్లో సీఆర్‌డీఏ విస్తరించేలా మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు.
 సీపీఏ (సెంట్రల్ ప్లానింగ్ ఏరియా): కేంద్ర ప్రణాళిక ప్రాంతం. దీని పరిధి 854 చ.కిమీలు. 2,11,028 ఎకరాల్లో కేంద్ర ప్రణాళిక ప్రాంతాన్ని ఏర్పాటుచేయాలని మాస్టర్‌ప్లాన్‌లో సూచించారు.
 ఎస్‌సీఏ (సీడ్ కేపిటల్ ఏరియా): ప్రధాన రాజధాని ప్రాంతం. దీని పరిధి 217 చకిమీలు. అంటే.. 53,612 ఎకరాల్లో ప్రధాన రాజధాని విస్తరించి ఉండేలా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించారు.  
 
 రాజధాని ప్రాంతంలో జనాభా..
 సంవత్సరం    జనాభా    ఉద్యోగాల కల్పన
     (అంచనా)    (అంచనా)
 2035    1.10 కోట్లు     33.10 లక్షలు
 2050    1.35 కోట్లు     56 లక్షలు
 
 రహదారుల వ్యవస్థ
 ఎక్స్‌ప్రెస్,సెమీ వేలు    127 కిమీలు
 ప్రధాన రహదారులు    155 కిమీలు
 ఉప రహదారులు    332 కిమీలు
 అంతర్గత రహదారులు    324 కిమీలు
 మెట్రో రైలు మార్గం    135 కిమీలు
 సైకిల్ మార్గాలు    150 కిమీలు
 నడక మార్గం    170 కిమీలు
 తీర మార్గం    35 కిమీలు
 అంతర్గత జలమార్గాలు    80 కిమీలు
 హరితవనం    200 కిమీలు
 
 రాజధాని ప్రణాళిక
 సెంట్రల్ మెగా సిటీ
నది
అడవి
రాజధాని నగరం
రాజధాని ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నగరం
టూరిజం కేంద్రం
పటిష్టమైన వస్తు రవాణా కేంద్రం  
వ్యవసాయ జోన్-1
వ్యవసాయ జోన్-2
భవిష్యత్‌లో నగరం విస్తరించు ప్రాంతం

మరిన్ని వార్తలు