కులం.. దేశానికి పట్టిన దెయ్యం

20 Dec, 2013 09:54 IST|Sakshi
Amartya sen

సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా ఉత్తమ పరిష్కార మార్గం చర్చలేనని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. కులం దేశానికి పట్టిన అతిపెద్ద దెయ్యమని అభివర్ణించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్‌కు గురువారం డాక్టరేట్‌ను అందజేసింది. అనంతరం వర్సిటీలోని ఆడిటోరియంలో ‘విశ్వవిద్యాలయాల్లో కాఫీ షాపుల ఆవశ్యకత’ అనే అంశంపై అమర్త్యసేన్ ప్రసంగిస్తుండగా దళిత విద్యార్థులు అడ్డుతగిలారు. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని, దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైస్ చాన్స్‌లర్, భద్రతా సిబ్బంది విద్యార్థులను బుజ్జగించారు. అనంతరం అమర్త్యసేన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అదే సరైన మార్గమని సూచించారు. తానూ అనేక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నానని.. ఆహార భద్రతా చట్టం, దళిత, మైనారిటీ హక్కులు, బాలల పోషకాహారం వంటి సమస్యలపై నేరుగా పోరాడానని  తెలిపారు.

ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల్లో సమానత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘నిరసించు, చైతన్యపరచు, వ్యవస్థీకరించు’ అనే అంబేద్కర్ సూచనను అందరూ పాటించాలని నొక్కి చెప్పారు.  విద్య, వైద్యం, పోషకాహారం వంటి కీలక అంశాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అథమ స్థానంలో ఉందన్నారు. దేశంలో మూడో వంతు ప్రజలకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేదని, ఇలాంటి సామాజిక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అందుకు ప్రసార మాధ్యమాలు సహకరించాలని అమర్త్యసేన్ కోరారు. చివరిగా విద్యార్థులడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్‌లర్ హనుమంతరావు, వైస్ చాన్స్‌లర్ రామకృష్ణ రామస్వామి, రిజిస్ట్రార్ రాజశేఖర్, ఆర్థికశాస్త్ర విభాగం డీన్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు