త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ

7 Nov, 2023 11:36 IST|Sakshi

మొబైల్ సబ్‌స్క్రైబర్‌లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్‌ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్‌లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్‌ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్‌ఫ్రాడ్‌ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్‌ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్‌లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్‌ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్‌కార్డ్‌లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్‌కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్‌ ‍ద్వారా తనిఖీ   చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్‌ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్‌ కనెక్షన్‌ల సమాచారం తెలిసే వీలుంది.

ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్

సిమ్‌కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్‌ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్‌ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్‌ ఐడీ సహాయపడుతుందని సమాచారం.

ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఆదేశాలు

ప్రభుత్వం ఇటీవల టెలికామ్‌ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్‌లను నిలిపివేసింది.

మరిన్ని వార్తలు