అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

17 Jan, 2015 02:35 IST|Sakshi
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ధనుర్మాసంలో వచ్చే పండగల్లో భోగి.. మకర సంక్రాంతి.. కనుమ పండగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అందుకే ఈ పండగలకు అంత ప్రాముఖ్యత. దూరాన ఉన్న కొడుకులు.. కోడళ్లు.. అల్లుళ్లు.. మనమలు, మనవరాళ్లు.. అంతా కలసి చేసుకునే పండగ. మూడు రోజుల పాటు జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. ఆవుపేడ అలికిన వాకిళ్లు .. రంగు రంగుల ముగ్గులు.. మధ్యలో గొబ్బెమ్మలు.. ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల భజనలు.

ఇంట్లో పిండ వంటల ఘుమఘుమలు.. పతంగులు.. కబడ్డీ.. ముగ్గులు.. ఎద్దులు.. కోళ్ల పందేలు పోటీలు. కొత్తబట్టలతో పండక్కి వచ్చిన చుట్టాలతో ఇల్లంతా సందడి.. సందడిగా సంక్రాంతి పండగ జరుపుకున్నారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు రాచమర్యాదలు.. అప్యాయతానురాగాల మధ్య పండగ అంబరాన్నింటింది. గురువారం సంక్రాంతి రోజున పల్లెల్లో మహిళలు ప్రత్యేకంగా మట్టిపాత్రలో పాలతో పొంగళ్లుపెట్టి.. కొత్తబట్టలతో పెద్దలకు నైవేద్యంగా సమర్పించుకున్నారు.

అందులో భాగంగా నెల్లూరులోని బోడిగాడి తోటలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తర్పణం వదలటం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగను సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. మూడవరోజైన శుక్రవారం కనుమ పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువులకు పూజలు నిర్వహించారు. నెల్లూరులో గురువారం రాత్రి శ్రీతిక్కన మహాకవి లలితకళాపీఠం ఆధ్వర్యంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మకరసంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

కళాపీఠం వ్యవస్థాపకులు ఆలూరు శిరోమణిశర్మ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం, సంగీత కార్యక్రమాలతో ఆహూతులను అలరింపజేశారు. కనుమ పండగ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు.
 
నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఇస్కాన్ మందిరం ప్రాంగణంలో నిర్వహించిన గోపూజోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 గోశాలలోనూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కనుమ పండగ సందర్భంగా కావలిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో  కనులపండువగా గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణం  జరిగింది. కావలి ఇలవేల్పు శ్రీకళుగోళశాంభవి దేవి అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం శుక్రవారం రాత్రి వరకు పురవీధులలో ఊరేగారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. సంగంలో కొండతిరుగుడు ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. వెంకటగిరిలో శుక్రవారం గొబ్బెమ్మ నిమజ్జనం వేడుకగా నిర్వహించారు. స్థానిక కాశీతోట ప్రాంతంలోని కైవల్యానదితీరంలో మహిళలు గొబ్బిపాటలు, ఆటలు, వనభోజనాలతో సందడి చేశారు. అనంతరం గొబ్బెమ్మ( గౌరమ్మ)ను నిమజ్జనం చేశారు.

వెంకటగిరి పట్టణం కుమ్మరిగుంట సాయిబాబా ఆశ్రమం ఆధ్వర్యంలో కుమ్మరిగుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. పెంచలయ్యకోనలో కనుమ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
 
కనుల పండువగా తెప్పోత్సవం... నెల్లూరు నవాబుపేట మైపాడుగేట్‌వద్ద జాఫర్‌సాహెబ్‌కెనాల్‌లో శుక్రవారం రాత్రి శ్రీభ్రమరాంబసమేత శ్రీమల్లేశ్వరస్వామివారి కనుమ తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. సంప్రదాయంలో భాగంగా నగర పరిసరాల్లో కొలువైన దేవతలు దేవేరులతో కలసి నవలాకులతోట ప్రాంతానికి కల్యాణమహోత్సవం అనంతరం వనవిహారానికి మేళతాళాలతో సర్వాలంకారశోభితులుగా విచ్చేసి విహరించారు.

మరిన్ని వార్తలు