అనంతుని కష్టాలు

24 Oct, 2015 01:01 IST|Sakshi
అనంతుని కష్టాలు

శిథిలావస్థలో అనంత పద్మనాభుని ఆలయం
దూప, దీప, నైవేద్యాలకు నోచుకోని వైనం
 

వేలాది ఎకరాల ఆస్తులు... పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ఒకప్పుడు విజయనగర సంస్థానంలో దివ్యంగా వెలుగొందింది. అనంతపద్మనాభుని ఆలయం. దీనికి అనుబంధంగా ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయం పద్మనాభ యుద్ధ కార్య క్షేత్రానికి సాక్షిభూతంగా నిలుస్తుంది.  ఎంతో ఘన చరిత్ర గలిగిన ఈ ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. చివరకు దూప, దీప నైవేద్యాలకు వేరొక ఆలయంపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
 - పద్మనాభం
 
 ఆస్తిపాస్తులు

 పద్మనాభస్వామికి పూర్వం విజయనగర సంస్థానాదీశులు 3,514 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూములు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో పూర్వం అనంతపద్మనాభస్వామి ప్రాంగణం నిత్యం ఆధ్యాత్మిక వాతావరణంతో వర్ధిల్లేది.

 ప్రస్తుత పరిస్థితి
 ఆ భూములన్నీ రైతుల సాగులో ఉన్నాయి. వీటికి సంబంధించి కనీస శిస్తులు వసూలు కావడం లేదు. 1961 వరకు కాస్తో కూస్తో రైతులు శిస్తులు చెల్లించినప్పటికీ ఆ తర్వాత నుంచి పూర్తిగా వసూలు కావడం లేదు.
 నలుగుతున్న వివాదం
 1961 నుంచి శిస్తు బ కాయిలను చెల్లించాలని దేవాదాయ శాఖ అధికారులు గతంలో ఆదేశాలు జారీ చేశారు. వేలాది రూపాయిలు బకాయిలు ఒకేసారి చెల్లించలేమని రైతులు చేతులేత్తేశారు. ఈ భూములకు సంబంధించి సాగు హక్కులను రైతులకు ఇస్తూ పాస్ పుస్తకాలు జారీ చేశారు. టైటిల్ డీడ్‌లు మాత్రం అనంతపద్మనాభస్వామి పేరునే ఉన్నాయి. గతంలో దేవాదాయ శాఖ అధికారులు ఈ భూములను వేలం పాట వేయడానికి పూనుకున్నారు. దీనికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా పాట నిలిచిపోయింది.
 
 అభివృద్ధి శూన్యం
 ఆలయం నిర్మించినప్పటి నుంచి నేటి వరకు క్షేత్ర అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దూప, దీప నైవేద్యాలకు కూడా ఆదాయం లే ని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అనంతపద్మనాభస్వామి ఆల యం నుంచి సింహాచలం నృసింహస్వామి, పొట్నూరు కొదండ రామస్వామి, పుష్పగిరి వేణుగోపాలస్వామి, విజయనగరం పైడితల్లమ్మ, కురపల్లి శివాలయం వంటి 13 ఆలయాలకు దూప, దీప నైవేద్యాలకు పంపించేవారు. ఎటువంటి ఆదాయం లేకపోవడంతో 1982 నుంచి సింహాచలం దేవస్థానం నుంచి అనంత పద్మనాభ స్వామికి అవసరమైన దూప, దీప, నైవేద్యానికి సంబంధించి దినుసులు పంపుతున్నారు.
 
తగ్గిన వైభవం

నిధుల కొరత ఏర్పడడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించలేదు. కార్తీక మాసంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నా.. అనంతుని జయంతి, కల్యాణాలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు.
 
కనుమరుగైన బ్రహ్మోత్సవాలు

 కార్తీమాసంలో గతంలో బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించేవారు. అనంతుని పుష్కరణిలో తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపారు. సుమారు 45 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలను నిర్వహించడంలేదు. ఉత్సవాలు కనుమరుగవడంతో పుష్కరణి నిరాదరణకు గురైంది. ఆరు ఎకరాల్లోని పూలతోట పూర్తిగా ఆక్రమణకు పాలైంది.
 
ఘన చరిత్ర
గిరిపైన ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలోను, గిరి దిగువన ఉన్న కుంతీ మాధవస్వామి ఆలయాన్ని 18వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సంస్థాన దీశులు నిర్మించారు. 1723లో దివాన్లు అయిన పెనుమత్స జగన్నాథరాజు, విజయరామరాజు, సాహెబ్ ఆధ్యర్యంలో కుంతీ మాధవస్వామి ఆలయ బేడా నిర్మించినట్టు శిలా శాసనం ఇప్పటికీ ఉంది. 1793 జులై 10న బ్రిటిష్ వారికి, విజయనగరం సంస్థానదీశుడైన రెండో విజయరామరాజుకు జరిగిన పద్మనాభం యుద్ధానికి సంబంధించి ముందస్తు వ్యూహం కుంతీ మాధవస్వామి ఆలయంలోనే జరిగింది. అనందపద్మనాభస్వామి ఆలయాలు దేశంలో రెండు చోట్ల ఉండగా అందులో ఇది ఒక్కటి.
 
 
 నిర్మాణాలు శిథిలం
 ఆలయ ప్రాంగణంలోని నిర్మాణాలు శిథిలావస్ధకు చేరుకున్నా వీటి మరమ్మతులు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. కుంతీ మాధవ స్వామి ఆలయం లోపల భాగం పెచ్చులూడిపోయింది. బోగ మండపం వర్షాలకు కారిపోతుంది. బేడా పై భాగం పెచ్చులూడిపోయి బీటలు వారింది. రథశాల, వంట, వాహన, దినుసుల శాలలు పూర్తిగా శిథిలమయ్యాయి. దీని వల్ల గరుడ వాహనాన్ని కుంతీ మాధవ స్వామి ఆలయంలో ఉంచాల్సి వస్తోంది. గిరిపైన ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ ధ్వజ స్తంభం 15 ఏళ్ల క్రితం, కుంతీ మాధవస్వామి ఆలయ ధ్వజ స్తంభం హుద్‌హుద్ తుపాన్‌కు శిథిలమయ్యాయి. వీటిని ఏప్రిల్ 13న పున ఃప్రతిష్ఠించారు. కానీ ఇత్తడి తొడుగు అమర్చకపోవడంతో వెలవెలబోతున్నాయి.
 
 

మరిన్ని వార్తలు