స్థిరమైన ఆదాయం కోసం మార్గాలు - తెలుసుకోవాల్సిందే!

30 Oct, 2023 07:05 IST|Sakshi

నేను ఒకేసారి రూ.12 లక్షలను మూడు, నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? డెట్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి.. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ఎంచుకోవడం ద్వారా మంచి రాబడులు అందుకోవచ్చా? – మయూర్‌

సంపద సృష్టి మూడు నాలుగేళ్లలో సాధ్యపడుతుందా? ఇది ఆందోళన కలిగించే అంశం. మూడు నుంచి నాలుగేళ్లలో సంపద సృష్టి సాధ్యపడదు. ఈక్విటీలు గణనీయమైన రాబడులను అందిస్తాయి. కానీ వాటికి కూడా 10–15 ఏళ్ల కాల వ్యవధి కావాలి. అంత కాలవ్యవధి మీకు లేకపోతే అప్పుడు సంప్రదాయ ఇన్వెస్టర్‌గానే ఆలోచించాలి. 

మూడు నుంచి నాలుగేళ్లలోనే పెట్టుబడిపై చెప్పుకోతగ్గంత రాబడి కావాలని కోరుకునేట్టు అయితే.. ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ లేదా కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఎక్కువ మొత్తాన్ని డెట్‌ సాధానాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధి కోసం అంటున్నారు కనుక 12–18 నెలల కాలం పాటు సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ఎంపిక చేసుకుంటే మొత్తం పెట్టుబడుల్లో సగం కాల వ్యవధి అవుతుంది. దీనికి బదులు మూడు నుంచి నాలుగు నెలల్లోగా సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ద్వారా ఈక్విటీలకు కేటాయించుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.  

నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ

విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని ఉండాలి. అప్పుడే ఆ మొత్తం నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్‌ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసర సమయాల్లో పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకునే విధంగా లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. సీనియర్‌ సిటిజన్లు ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. 

ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్‌ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు.

ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కు వ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకా అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్‌ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. 

పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలను పరిశీలించాలి. ఎస్‌సీఎస్‌ఎస్, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కొంత మొత్తాన్ని అధిక నాణ్య తతో కూడిన డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40% మేర ఉండేలా ఏడాదికోసారి అస్సెట్‌ (పెట్టుబడులు)రీబ్యాలన్స్‌ చేసుకోవాలి.


ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు