వేయండి పాగా!

19 Jul, 2014 02:35 IST|Sakshi
వేయండి పాగా!

అనంతపురం సిటీ : అనంతపురం నగర పాలక సంస్థకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. అడిగేవారు లేకపోవడంతో కొద్దికొద్దిగా ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే పదెకరాలకు పైగా కాజేశారు. నగర పాలక సంస్థ అనుమతి లేకుండానే రెవెన్యూ శాఖ కూడా ఇందులో పట్టాలిచ్చేస్తోంది. ఇప్పటికే 41 ఎకరాల భూమిని పట్టాల రూపంలో పంచిపెట్టింది. అందులో ఇళ్లు కూడా కట్టేశారు.
 
 ఇంకొన్నేళ్లు ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మొత్తం భూమి చేజారిపోయే పరిస్థితి కన్పిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నగర పాలక సంస్థకు పండమేరు నీటి సరఫరా ప్రాజెక్టు కింద సర్వే నెంబరు 134లో 16.71 ఎకరాలు, 135లో 10.46 ఎకరాలు, 136-1లో 7.35 ఎకరాలు, 136-2లో 142.45 ఎకరాలు కలిపి మొత్తం 176.97 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎంత తక్కువన్నా ఎకరా రూ.40 లక్షలకు పైగా పలుకుతోంది.
 
 అంటే మొత్తం భూమి విలువ రూ.70 కోట్లకు పైగా ఉంటుంది. ఇంతటి విలువైన భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనంత నగర అభివృద్ధి కమిటీ పేరిట ఏర్పడిన సంఘాల ప్రతినిధులు కూడా స్పందించడం లేదు. నగర పాలక సంస్థ ప్రమేయం, అనుమతి లేకుండానే 41 ఎకరాల్లో రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు 18 ఎకరాలు, పోస్టల్ కాలనీకి 10 ఎకరాలు, కళాకారుల కాలనీకి 8 ఎకరాలు, స్వర్ణకారులకు 5 ఎకరాలు కేటాయించారు. సందట్లో సడేమియా అన్నట్లు కబ్జాదారులు కూడా ప్రతాపం చూపుతున్నారు.
 
 అవకాశం చిక్కినప్పుడల్లా హద్దుల వెంబడి కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పదెకరాల మేర ఆక్రమించారు. 2013, మార్చిలో ఇక్కడ 30 ఎకరాల మేర భూమిని కొందరు ఆక్రమించి.. పేదల నుంచి డబ్బు తీసుకుని గుడిసెలు వేయించారు. దీన్ని అప్పటి కమిషనర్ నీలకంఠారెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మార్చి 28న భారీ పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆక్రమణలను దగ్గరుండి తొలగింపజేశారు. అయితే.. ఇప్పటికీ కబ్జాదారులకు ఈ భూమిపై కన్ను ఉంది. అదను కోసం ఎదురు చూస్తున్నారు. పట్టాలివ్వగా, ఆక్రమణకు గురికాగా..ప్రస్తుతం125 ఎకరాల వరకు మిగిలింది. దీన్నైనా కాపాడుకునేందుకు కనీసం ప్రహరీ నిర్మించాల్సిన అవసరముంది.
 
 చర్యలు తీసుకుంటాం
 పండమేరు వద్ద ఉన్న భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిస్తాం. ఆ భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆ దిశగా పరిశీలిస్తాం.                    
 - మదమంచి స్వరూప, మేయర్
 

మరిన్ని వార్తలు