వరుస దాడులు.. ఆగేనా దందాలు!

30 Dec, 2013 02:19 IST|Sakshi
కుక్క తోక వంకర.. అన్నట్లు ఎన్నిసార్లు దాడులు జరిగినా ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఉమ్మడి తనిఖీ కేంద్రం సిబ్బంది తీరు మారడం లేదు. దాడులు జరిగితే మాకేంటి.. అన్నట్లు అక్రమ వసూళ్లు, ప్రైవేట్ వ్యక్తుల దందా ఏమాత్రం ఆగడంలేదు. ఏడాదిలో మూడోసారి.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి.. ఏసీబీ దాడి చేసినప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల రూపాయల అక్రమ వసూళ్లు సాగాయంటేనే ఇక్కడ అవినీతి ఎంతగా వ్యవస్థీకృతమైపోయిందో అర్థమవుతుంది. దాడులు జరుగుతున్నా.. అనంతర చర్యలు కఠినంగా లేకపోవడం వల్లే అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటం లేదన్నది సుస్పష్టం. తాజాగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోమారు ఏసీబీ దాడి చేసి, కేసులు నమోదు చేసినా.. ఈ దందా ఆగుతుందన్న నమ్మకం మాత్రం లేదు.
 
 ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: ఏడాదిలో మూడోసారి.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి పురుషోత్తపురంలోని ఉమ్మడి తనిఖీ ప్రాంగణం(చెక్‌పోస్టు)పై ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 13 మందిపై కేసులు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ సీతాపతి నేతృత్వంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికారులు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నా రు. దూరం నుంచే చెక్‌పోస్టు పరిసరాలను అరగంటకు పైగా పరిశీలించారు. అనంతరం చెక్‌పోస్టు ఆవరణ వెనుక నుంచి కార్యాలయంలోకి ప్రవేశించారు. అధికారులను గమనించిన పలువురు ప్రవేటు వ్యక్తులు బయటకు జారుకోగా ఆరుగురు మాత్రం దొరికిపోయారు. 
 
 కౌంటర్ల వద్ద తిష్ఠ
 అనంతరం అధికారులు వివిధ విభాగాల కౌంటర్ల వద్ద కూర్చొని అక్కడి వసూళ్లను గమనించారు. ఇదే మీ తెలియని లారీల సిబ్బంది ఎప్పటిలాగే అదనపు మొత్తాలు చెల్లించి తమ పత్రాలపై తనిఖీ ముద్రలు చేయించుకుని వెళ్లసాగారు. కొందరు డబ్బులు తీసుకొని తొందరగా తమ పత్రాలపై ముద్రలు వేయాలని కౌంటర్ల వద్ద ఉన్న అధికారులను కోరారు. చెక్‌పోస్టు వెలుపల ఉన్న ఎక్సైజ్ కౌంటర్ సిబ్బంది ఏసీబీ అధికారులను గమనించి కౌంటర్ వదిలి పారిపోగా లారీల సిబ్బంది పది రూపాయలు పెట్టి, పత్రాలపై తామే రబ్బర్ స్టాంప్ ముద్రలు వేసుకొని వెళ్లిపోయారు. సమీపంలోనే ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది బయటకు వెళ్లక ముందే ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
 
 కౌంటర్ల వద్ద డ్రైవర్ల రచ్చ
 కౌంటర్లలో ఏసీబీ సిబ్బంది కూర్చోవడంతో లారీల పత్రాల తనిఖీలు నెమ్మదించాయి. కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. చెక్‌పోస్టు అవరణలో ట్రాఫిక్ కూడా స్తంభించింది. దీంతో సహనం కోల్పోయిన కొందరు డ్రైవర్లు అరవడం ప్రారంభించారు. తొందరగా తనిఖీ చేయాలని కేకలు వేస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించారు. 
 
 5 గంటలపాటు తనిఖీలు
 అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైన తనిఖీలు ఆదివారం ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ 5 గంటల వ్యవధిలో రూ.1,25 లక్షల అక్రమ వసూళ్ల మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు ప్రైవేటు వ్యక్తులు, ఏడుగురు సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సీతాపతి విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు. కార్యాలయంలో ఉన్న ఆరుగురు ప్రైవేటు వ్యక్తులతోపాటు ఒక ఏఎంవీఐ, ఇద్దరు ఏసీటీవోలు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు సీఐలు అజాద్, రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.
 
 వరుస దాడులతో కలకలం
 ఒకే ఏడాదిలో మూడుసార్లు ఈ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి చేయడం కలకలం రేపింది. సాధారణంగా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులపై ఏడాదికోసారే దాడి జరిపి తనిఖీలు నిర్వహిస్తారు. ఒకసారి దాడి చేస్తే.. మళ్లీ ఏడాది వరకు అటువైపు చూడరు. మధ్యలో విజిలెన్స్ దాడులు మాత్రమే జరుగుతుంటాయి. ఈసారి దీనికి భిన్నంగా మూడుసార్లు దాడి చేశారు. జూన్‌లో ఒకసారి దాడి చేసిన అధికారులు, ఈ నెల 21(శనివారం) అర్ధరాత్రి.. తిరిగి ఈ శనివారం అర్ధరాత్రి మరోసారి దాడి చేశారు. గత వారం జరిపిన తనిఖీలో రూ.2.15 లక్షల అనధికార సొమ్ము స్వాధీనం చేసుకొని, 20 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇక దాడులు జరగవన్న ధీమాతో ఉన్న చెక్‌పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ దశలోనే తాజా దాడి జరిగింది. దాడులెన్ని జరిగినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనంత వరకు ఈ అక్రమ వసూళ్లకు బ్రేక్ పడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
మరిన్ని వార్తలు