ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు..

30 Dec, 2013 02:18 IST|Sakshi

మొయినాబాద్, న్యూస్‌లైన్: నగర శివారులో ఉన్న ఫాంహౌస్‌లు, రిసార్టులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. పార్టీల పేరుతో యువత పీకలదాకా మద్యం, డ్రగ్స్ సేవిస్తూ గొడవలు సృష్టించినా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందితే రాజీలు కుదుర్చుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ అందగానే కేసు నమోదు చేయాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఖాకీలు పట్టించుకోవడం లేదు. తాజా ఘటన దీనికి ఉదాహరణ. మొయినాబాద్ మండలం సురంగల్‌లో రెండు రోజుల క్రితం రాత్రి ఓ ఫాంహౌస్‌లో నగరానికి చెందిన కొందరు ఓ యువతి బర్త్‌డే పార్టీకి వచ్చారు. అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ, డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం. ఈక్రమంలో అక్కడ ఓ యువకుడిని చితకబాదారు.
 
 దీంతో యువకుడు సురంగల్ గ్రామంలోకి పరుగెత్తుకెళ్లాడు. ఫోన్ ద్వారా విషయం స్నేహితులకు చెప్పాడు. అతడు గ్రామంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందాడు. కొద్దిసేపటికి నగరం నుంచి వచ్చిన అతడి స్నేహితులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకొని ఆశ్రయమిచ్చిన వ్యక్తిపై దాడి చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి దాడి చేసిన వారు పరారయ్యారు. అనంతరం పోలీసులు ఫాంహౌస్‌లో దొరికిన వారిని ఠాణాకు తీసుకెళ్లారు. వారిని వైద్య పరీక్షల కోసం నగరానికి తీసుకెళ్లి అటునుంచి అటు వారి ఇళ్లకు పంపారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దెబ్బలుతిన్న సురంగల్ గ్రామస్తుడు ఫిర్యాదు చేయగా  రాజీ కుదిర్చినట్లు సమాచారం. ఈ ఘటనలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు