ఎన్‌ఆర్‌సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం

17 Jun, 2020 16:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌పీఆర్‌–2020 (నేషనల్‌ పాపులేషన్‌ ఆఫ్‌ రిజిస్టర్‌)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయని అన్నారు. అందువల్ల 2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు ఎన్‌పీఆర్‌–2020లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలని స్పష్టం చేశారు. 

మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అంజాద్‌బాషా కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని గతంలో సీఎం అన్నారని ఆయన ప్రస్తావించారు.

అభ్యంతరకర అంశాలు
గతంలో కూడా 2010, 2015లో ఎన్‌పీఆర్‌ నిర్వహించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టినతేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంజాద్‌బాషా అన్నారు. అందుకే మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశామని అంజాద్‌బాషా తెలిపారు. దాని ఆధారంగా ఇప్పుడు సభలో మరో తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు