ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

20 Jan, 2020 11:09 IST|Sakshi

మూడు రోజుల పాటు సాగనున్న అసెంబ్లీ సమావేశాలు

కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెం‍బ్లీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిమండలి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన అంశాలపై ప్రస్తుత శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో చర్చించనుంది. సభ చర్చించాల్సిన అంశాల ఎజెండాతో పాటు సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమైంది.

బీఏసీ అనంతరం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. అలాగే వీటిపై సుదీర్ఘంగా చర్చించేందుకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ వంటి ప్రతిపాదిత అంశాలను బీఏసీలో టీడీపీ వ్యతిరేకించినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తారా..? అని  టీడీపీపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. (హై పవర్‌ కమిటీ నివేదికకు కేబినెట్‌ ఆమోదం)

మరిన్ని వార్తలు