రాజధాని తరలింపుపై అధికారిక ఉత్తర్వుల్లేవు

9 Jan, 2020 09:59 IST|Sakshi

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు.. తరలింపును సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలన్నీ అపరిపక్వమైనవే అవుతాయని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, ఉత్తర్వులు రానప్పుడు, ఈ అంశంపై తామెలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. అంత హడావుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పింది. తరలింపు అనేది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవుల తరువాత పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావుకు స్పష్టం చేసింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు బుధవారం సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... రాజధాని తరలింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏవైనా అధికారిక ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించింది. లేదని సుబ్బారావు చెప్పడంతో, అలాంటప్పడు ఇంత అత్యవసరంగా ఈ అంశంపై విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

మూడు రాజధానులకే ఓటు

అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

చంద్రబాబు వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ

మూడు రాజధానులకు మా మద్దతు
 

మరిన్ని వార్తలు