రఘురామరాజు ఇంప్లీడ్‌ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరం లేదు

9 Nov, 2023 04:20 IST|Sakshi

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం  

ఈ వ్యాజ్యాన్ని అనుమతిస్తే కేసు రాజకీయరంగు పులుముకుంటుంది 

స్పష్టం చేసిన సీజే ధర్మాసనం.. విచారణ 3 వారాలకు వాయిదా 

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. పిటిషనర్‌ వంటి రాజకీయ నాయకుడు దాఖలు చేసిన ఈ ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతిస్తే ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటుందని వ్యాఖ్యానించింది.

ఈ ఇంప్లీడ్‌ పిటిషన్‌ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదే సమయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్‌ సంజయ్‌  మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను తర్జు­మా చేసి తమ ముందు ఉంచకపోవడంపై పిటిషనర్‌ను హైకోర్టు నిలదీసింది. ఏఏజీ, సీఐడీ చీఫ్‌ ఏ నిబంధనలు ఉల్లంఘించారో, వారిపై ఏం చర్యలు కోరుతున్నారో చెప్పాలంది. నిబంధనల ప్రకారం వారిని తొలగించడమో, సస్పెండ్‌ చేయడమో చేయాలని పిటిషనర్‌ న్యాయవాది గిరిబాబు తెలిపారు. చంద్రబాబు కేసు వివరాలను వారు బహిర్గతం చేశారని, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు.

వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. స్కిల్‌ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్‌ సంజయ్‌లను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖ­లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చు­కోవాలంటూ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్‌ పిటిష­న్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి 
ప్రజా సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను ప్రశ్ని­స్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు తప్పుకున్నారు. దీంతో జస్టిస్‌ రఘునందన్‌రావు సభ్యుడిగా లేని బెంచ్‌ ముందు ఈ వ్యాజ్యాన్ని ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యా­యమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రా­వు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు